గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మరింత మెరుగవుతాయంటున్నారు.
-కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 5
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ మీడియం అందని ద్రాక్షలా ఉంది. కొన్ని గ్రామాల్లో మాత్రం ఉపాధ్యాయుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ బడుల్లో ఇంగ్ల్లిష్ మీడియం ఏర్పాటు చేయడంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో ఇంగ్ల్లిష్మీడియం విద్యాబోధన 13 ఏండ్ల క్రితమే ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమన్వయంతో ముందుకు వెళ్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గర్గుల్ గ్రామం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపించేవారు.
ఈ క్రమంలో వేలాది రూపాయలు ప్రైవేట్ స్కూళ్లలోకట్టేబదులు తలాకొంత డబ్బులు జమచేసి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించాలని నిర్ణయించారు. 2009 నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కావడంతోపాటు పాఠశాలలో సౌకర్యాలు మెరుగయ్యాయి. అలాగే దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పరస్పరం సహకరించుకుంటూ విజయబాటలో నడుస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, బీడీ కాలనీ, ఇస్రోజివాడి, గొల్లపల్లి, కన్నాపూర్ గ్రామాల నుంచి కూడా ఈ పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారు. పాఠశాలలో మొత్తం 352 మంది విద్యార్థులు ఉండగా.. ఇంగ్ల్లిష్మీడియం చదువుతున్నవారు190 వరకు ఉన్నారు.
గతేడాది నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలతోపాటు ఇంగ్ల్లిష్మీడియం బోధించేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి గ్రామస్తులు దాతల సహకారంతో వేతనాలను చెల్లిస్తున్నారు.
గర్గుల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గత ఐదేండ్లుగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రతి ఏడాది నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్‌షిప్‌నకు ఐదు నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికవుతూ రూ.12 వేల స్కాలర్షిప్ అందుకుంటున్నారు. మేధా స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించే పరీక్షల్లో 2018లో ప్రతిభ కనబర్చిన భాస్కరి రమణి అనే విద్యార్థిని మెడిసిటీ కాలేజీలో ఉచితంగా మెడిసిన్ చదువుగా, గత ఏడాది ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థినులు యాదరి లిఖిత, స్నేహ శ్రీ చైతన్యలో ఉచిత విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీలో ఉత్తమప్రతిభ కనబర్చారు. ప్రస్తుతం అటల్ టింకరింగ్ ల్యాబ్‌కు గాను రూ.12 లక్షలు మంజూరుకాగా, పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్ల్లిష్మీడియం ప్రారంభించడంలో గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తు న్నాం. చదువుతోపాటు పోటీపరీక్షల్లో, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
– నర్సింహారెడ్డి, హెచ్ఎం
పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పం పించకుండా గ్రామంలోని ప్రభు త్వ బడిలోనే ఇంగ్లిష్ మీడి యం ప్రారంభించాలని గ్రామస్తులంద రం కలిసి నిర్ణయించాం. డబ్బులు జమచేసి పాఠశాల అవసరాలకు ఖర్చు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాం. క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నాం.
– రవితేజగౌడ్, సర్పంచ్
మా పాఠశాలలో మా త్రమే ఇంగ్ల్లిష్మీడియం ఏర్పాటు చేయడం, మే ము ఇంగ్ల్లిష్మీడియంలో చదువుకోవడం ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన గ్రామస్తులకు మా ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– సయ్యద్ సాబా, పదో తరగతి విద్యార్థిని