మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకూ మెరుగైన విద్యాబోధన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చింది 317 జీవో. ఈ జీవోతో ఉద్యోగుల ఏండ్ల కల నెరవేరింది. ఏండ్లపాటు జిల్లా నుంచి పక్క జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మేలు జరిగింది. సర్కారు తెచ్చిన జీవో తమను సొంత గూటికి చేర్చిందని పలువురు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధంగానే విభజన జరిగిందంటున్న ఉద్యోగుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
-ఇందూరు/బాన్సువాడ, ఫిబ్రవరి 4
ఎంతో కాలంగా తమ కుటుంబాలను వదిలి కష్టంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోతో మంచి అవకాశం కల్పించిందని పలువురు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సొంత జిల్లాలో విధులు నిర్వర్తించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో 90శాతం మంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు న్యాయబద్ధమైన విభజన జరిగిందని చెబుతున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగడం ఎంతో సంతోషంగా ఉందని, వారివారి కుటుంబసభ్యులతో కలిసి సొంత ప్రాంతాల్లో విధుల నిర్వహణపై ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నేను 22 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నాను. 2015లో గాంధారికి బదిలీ అయ్యాను. నిజామాబాద్‌కు రావాలని 2018లో ప్రయత్నం చేయగా బాన్సువాడలోని హన్మాజీవాడకు బదిలీ చేశారు. 317 జీవోతో మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌కు బదిలీ అయ్యింది. సొంత జిల్లాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. రోజూ 70 నుంచి 90 కిలోమీటర్ల ప్రయాణం చేసే పని లేదు. విద్యార్థుల కోసం సమయం కేటాయించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తా.
– ధర్మాసింగ్, సీనియర్ ఉపాధ్యాయుడు
317 జీవోకు ముందు కామారెడ్డికి బదిలీ అయిన ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడు సొంత జిల్లాకు వస్తామా అని ఎదురుచూశారు. వారి కల ఈ జీవోతో నెరవేరింది. నిజామాబాద్‌కు ఎంతమంది బదిలీ అయ్యారో దాదాపు అంతేమంది సొంత జిల్లా కామారెడ్డికి వెళ్లాలని అనుకునేవారు సంతోషంగా ఉన్నారు. కొంతమంది జూనియర్ ఉపాధ్యాయులు కామారెడ్డికి బదిలీ అయిన మాట వాస్తవమే. త్వరలోనే రిటైర్మెంట్లు ఉన్నందున వారినీ సొంత జిల్లాకు తీసుకువస్తాం.
– జి.లక్ష్మణ్, పీఆర్టీయూ ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి
317జీవోతో ఎంతో మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలో పనిచేసే శాశ్వత పరిష్కారం దొరికింది. స్థానికత ఆధారంగా విభజన జరగడం, ఎంతో కాలంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి సీనియారిటీ ప్రకారం విభజించడం చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగుల విభజనతో రాబోయే రోజుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంది.
– మహేందర్,(పుల్కల్) చమాన్ పాఠశాల, బాన్సువాడ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి నందిపేట్‌కు బదిలీ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. మహిళా ఉద్యోగులకు 317 జీవోతో చాలా మేలు జరిగింది. ఎన్నో ఏండ్లుగా సొం త జిల్లాకు రావాలని అనుకున్నా కుదరలేదు. 317జీవోతో సాధ్యమవడం సంతోషం.
-అనురాధ, టీచర్
కామారెడ్డి జిల్లా కోటగిరి నుంచి కోటగిరి మండలం ఎ త్తొండకు బదిలీ అయ్యింది. చాలా ఏండ్లుగా పక్క జిల్లా లో సేవలందించాను. సొంత జిల్లాలో సేవలందించలన్న కోరిక నెరవేరింది. ఎవరూ తొందరపడొద్దు. అందరికీ న్యాయం జరుగుతుంది. పీఆర్టీయూ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలోనే సొంత జిల్లాకు వచ్చేస్తారు.
– శంకర్, ఉపాధ్యాయుడు
స్థానికత ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది. అయినప్పటికీ ఈ బదిలీల్లో చాలా వరకు ఉద్యోగులు అనుకున్న చోట పనిచేసే అవకాశం లభించింది. వేసవిలో బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నాం. సీనియారిటీ ప్రకారం బదిలీలతో ఉద్యోగులకు న్యాయం జరిగింది. నాకు బాన్సువాడ మండలం నుంచి నిజామాబాద్‌లో నేను అనుకున్న చోటికి బదిలీ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది.
– ప్రవీణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత ఆంగ్ల విద్యనందించడానికి మారుమూల గ్రామానికి కూడా ఉపాధ్యాయులను పంపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా కొందరు ఉపాధ్యాయులు కామారెడ్డికి బదిలీ అయ్యారు. అక్కడి వారు కూడా నిజామాబాద్‌కు వచ్చారు. బడి బాగుంటేనే ఉపాధ్యాయులకు పని అని గుర్తించాలి. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారి కన్నా ఉద్యోగం వచ్చిన ఉపాధ్యాయులు కొంత సంయమనం పాటించాలి. ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేయదని గమనించాలి.
-వెంకటేశ్వర్ గౌడ్, పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి