నిజామాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇన్చార్జి మంత్రిగా పని చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ జిల్లాకు మార్చారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న మంత్రి దనసరి అనసూయ సీతక్కకు నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మార్పు చోటు చేసుకున్నది. అకస్మాత్తుగా ఇన్చార్జి మంత్రులను మార్చడం చర్చనీయాంశంగా మారింది.
ఏ కారణం మూలంగా ఈ మార్పు జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేకపోవడంతో ఇన్చార్జి మంత్రి అన్నింటికీ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా పట్టుమని పది మార్లు కూడా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పర్యటనకు జూపల్లి కృష్ణారావు రాలేదు. తూతూ మంత్రంగా పర్యటనలు నిర్వహించి మమ అనిపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై లోతైన సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. మంత్రి సీతక్కను ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించడంతో పరిస్థితిలో మార్పు ఉంటుందా? అనే విషయమై చర్చ సాగుతున్నది.
వాస్తవానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర ప్రాంత ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని ఒప్పుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవిని ఆశించారు. నేడు, రేపు అనుకుంటూ కాలం గడుపుతున్నప్పటికీ క్యాబినెట్లో చోటుదక్కలేదు. కాబోయే మంత్రిని అనే భావనలో సుదర్శన్ రెడ్డి యాక్టివ్ మంత్రిగా పని చేస్తూ పోయారు. ఈ దశలోనే జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి జిల్లా పాలనలో ఎక్కువగా స్వేచ్ఛను ఇవ్వలేదన్న వాదన కూడా ఉంది. మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికీ అమాత్య యోగం దక్కకపోవడంతో మంత్రి సీతక్క తనదైన శైలిలో ఉమ్మడి జిల్లాకు అండగా నిలుస్తారా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.