కంఠేశ్వర్, సెప్టెంబర్ 11 : అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అక్టోబర్ 29 నుంచి నవంబర్ 18లోగా రెండుసార్లు పోలింగ్ బూత్‌స్థాయిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని, డ్రాఫ్ట్ రోల్లో ఏమైనా అభ్యంతరాలుంటే స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి యాప్ ద్వారా ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో, లేదో నిర్ధారించుకోవాలన్నారు.
ఇంటింటి సర్వేకు తోడ్పాటు అందించి, ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అవసరమైన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాంటి పోలింగ్స్టేషన్లను గుర్తిస్తే, వివరాలను తమకు అందించాలన్నారు. అర్హులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.