నిజామాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొంత మంది మేధావులు ఆ రోజు వ్యక్తం చేసిన అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయని అన్నారు. కరెంట్ ఉండదని అనేక మంది భయపెట్టారని గుర్తు చేశారు. కానిప్పుడు ఫుల్ కరెంట్ వస్తున్నది. రైతులకు సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందుతున్నదని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే శాంతి, భద్రతల సమస్యలు వస్తాయని భయ పెట్టారని కానీ తొమ్మిదిన్నరేళ్లలో మత కల్లోలాలు లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారని చెప్పారు. ఇన్ని ఇబ్బందులున్న ప్రాంతానికి నాయకత్వం బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి వివరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి గెలవడం ఖాయమన్నారు. ప్రజలంతా మంచి, చెడులను బేరీజు వేసుకుని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను నిలబెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఇవి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారు. ప్రస్తుతం ఒక వైపు జాతీయ పార్టీలు, మరోవైపు ఒక ప్రాంతీయ పార్టీ(బీఆర్ఎస్) మాత్రమే ప్రజల చేతిలో ఉన్నటువంటి ఛాయిస్. కేసీఆర్ మాత్రమే ప్రజలకు టాప్ ప్రియారిటీ. మిగిలిన పార్టీలన్నీ ఇతరత్రా అవసరాలకు లొంగుతాయి. అంటే ఢిల్లీ నుంచి హుకుం వస్తే రాష్ట్ర నాయకత్వం తలొగ్గే అవకాశం ఆయా పార్టీల్లో కచ్చితంగా ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాలకు స్వేచ్ఛ ఉండదు. కేసీఆర్‌కు తెలంగాణ మాత్రమే ప్రాధాన్యతా అంశం. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించడు. అవసరమైతే పోరాటం చేసి సాధిస్తారు. తెలంగాణ ప్రజలకు ఏం అవసరమో గుర్తిస్తారు. వారికోసం రిస్క్ తీసుకుని పథకాలను అమలు చేసి చూపిస్తారు. మిగిలిన పార్టీలకు ఇతరత్రా రాష్ర్టాల్లో ప్రాధాన్యతలను అనుసరించి తెలంగాణ స్వప్రయోజనాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. కేసీఆర్‌కు కేవలం తెలంగాణే శ్వాస, తెలంగాణే ధ్యాస. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు మొదటి ప్రాధానతా అంశం. స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో, వచ్చిన తెలంగాణలో కేసీఆర్ పనితీరును చూస్తే తెలుస్తుంది.
తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలో సుమారుగా 8 జిల్లాలు కరువు ప్రభావితమైనవే. అలాంటిది ఇప్పుడు అంగుళం ఖాళీ లేకుండా పచ్చని పంట పొలాలతో యావత్ రాష్ట్రం కళకళలాడుతున్నది. ఎస్సారెస్పీ ప్రారంభం నుంచి దశాబ్దాలు గడిస్తే కానీ స్టేజీ 1, స్టేజీ 2 పూర్తి కాని దుస్థితి. కానీ కేసీఆర్ హయాంలో మాత్రం మూడేండ్లలో కాళేశ్వరం లాంటి పథకం పూర్తి కావడం. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం తక్కువ కాలంలోనే పూర్తి చేసి శ్రీరాంసాగర్‌కు ఊపిరి పోయడం అద్భుతమైన ప్రక్రియ. వట్టిపోతున్న ఎస్సారెస్పీకి తిరిగి పురుడు పోసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతున్నది. ఆయకట్టుకు సంపూర్ణమైన భరోసాను ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కల్పించారు. చెరువుల ఆయకట్టుకు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేశారు. మత్స్య సంపద పెరిగింది. చెరువులను ఆధారం చేసుకున్న వర్గాలనీ లబ్ధి పొందుతున్నాయి. అలాంటి వాతావరణం కేసీఆర్ పరిపాలనలోనే సాధ్యమైంది. ఇదీ పెద్ద విజయం.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవార్డుల్లో తెలంగాణకు స్థానం దక్కుతున్నది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మన పథకాలను గుర్తించి అభినందిస్తున్నాయి. 70శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. వారికి ఆసరాగా నిలిచిన కేసీఆర్‌తోనే పెట్టుబడి సాయం ప్రపంచంలోనే తొలిసారిగా విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్ర సంపద 50వేల కోట్లు. బలమైన పరిపాలన, పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించబడిన తర్వాత రెండున్నర లక్షల కోట్ల సంపదకు కేసీఆర్ పెంచారు. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వచ్చి అది చేస్తాం… ఇది చేస్తాం అంటున్నాయే తప్ప… సంపద పెంపునకు వారి పాత్రను చెప్పడం లేదు. కేసీఆర్ సంపాదించిన రాష్ట్ర సంపదను అత్త సొమ్ము అల్లుడు పంచినట్లుగా పంచుతామన్నట్లుగానే హామీలు ఇస్తున్నారు. వచ్చిన తెలంగాణలో సంపదను పెంచిన కేసీఆర్ గొప్పతనాన్ని మనమంతా గుర్తించాలి. పెంచిన సంపదను పేదలకు పంచడం అన్నది కేసీఆర్ విధానం. మిగిలిన పార్టీలు ఇస్తున్న హామీల్లో విశ్వసనీయత లేదు. వారికి సంపద పెంపుదలకు సంబంధించిన ఆలోచన ధోరణి అన్నది లేదు. వారికి భవిష్యత్తుపై ఒక అంచనా లేదు.
ఒకప్పుడు బిందెలతో రోడ్డెక్కి ఆందోళనలు చేయలేదా. తెలంగాణ వచ్చినంక… కేసీఆర్ పరిపాలనలో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా. ఎంతటి మార్పు మన కండ్ల ముందు ఉన్నదో ప్రజలంతా ఆలోచన చేయాలి. క్లీన్ వాటర్, ఫిల్టర్ వాటర్‌ను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లింది మిషన్ భగీరథ. ఖాళీ బిందెలు లేవు.. క్యూలు లేవు.. ఇంటికే నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీళ్లను కేసీఆర్ అందించారు. అతిసార వంటి వ్యాధులు ప్రబలడం లేదు. ఆరోగ్య తెలంగాణకు మిషన్ భగీరథ దారులు వేసింది. సాధారణంగా వేరే రాష్ర్టాల్లో(గుజరాత్లో) విగ్రహాలు కట్టి ఇదే అభివృద్ధి అని చూపిస్తారు. మన తెలంగాణలో గుర్తుండి పోయే చారిత్రక కట్టడాలను పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద జనాలను ఆదుకునేందుకు కట్టించారు. ఒక మనిషి పదేళ్ల నుంచి పరిపాలన నడుపుతున్నారు. అనుభవం ఉండి నడిపే వ్యక్తిని కాదని మంచి డ్రైవర్‌ను కాదని క్లీనర్‌కు స్టీరింగ్ ఇస్తే నష్టం సంభవిస్తుంది. ప్రజలంతా ఆలోచనలో పడ్డారు. కేసీఆర్‌కే మద్దతు ఇస్తారు. ఈ ఎన్నికల్లో ముమ్మాటికి కేసీఆర్ గెలవడం ఖాయం.