బోధన్, ఫిబ్రవరి 8: వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రచారం ప్రారంభమైనప్పటికీ, నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అనంతరం ఒక్కసారిగా ఎన్నికల వాతావరణ వేడెక్కింది. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారుచేయడంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. వారం రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ఎన్నికల ప్రచారం రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది.
హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. ఇక, గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలతో అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలో ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోయింది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, మహ్మద్ షకీల్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాయి. ఒకపక్క బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటర్లు నీరాజనం పడుతుండగా, మరోపక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రయోగించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ ఉద్యమం ఓటర్లలో కాంగ్రెస్ పాలనలో తాము ఎలా మోసపోయామో గ్రహించగలిగారు.
ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్ధులు ఆరు గ్యారెంటీలు – 420 హామల అమలుకు సంబంధించి నిలదీతలకు గురయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నగరాలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా చెప్పడంలో బీఆర్ఎస్ నాయకులు లెక్కలతో సహా వివరించడంలో సఫలీకృతులయ్యారు. అదే సమయంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు పట్టణాల అభివృద్ధికి నిధులు తేవడంలో చూపిన నిర్లక్ష్యాన్ని తమ ప్రచారంలో బహిర్గతం చేశారు. ప్రజల నుంచి అనూహ్యంగా మద్దతు వస్తుండడంతో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో గెలుపు ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు.