న్యాయం గెలిచింది.. అక్రమ నిర్బంధానికి తెర పడింది. ప్రశ్నించే గొంతుకపై కేంద్రం కక్ష గట్టి, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించింది. నెలల తరబడి కారాగారంలో నాలుగు గోడలకే పరిమితం చేసి మానసికంగా హింసించింది. కానీ న్యాయాన్ని, ధర్మాన్ని చెరబట్టి ఎన్ని రోజులు బంధించగలరు? నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్లు నియంత్రించగలరు? అక్రమ నిర్బంధాలతో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిన తరుణంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు న్యాయస్థానాలపై నమ్మకం పెంచింది. నిర్బంధ సంకెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు విముక్తి కల్పించింది. తద్వారా భారతావనిలో న్యాయవ్యవస్థ ఇంకా బతికే ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు నిరూపించింది. కోర్టు ఆదేశాలతో కవిత జైలు నుంచి మంగళవారం విడుదల కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టాయి.
-నిజామాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
‘నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. మొండిదాన్ని. మంచిదాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతతో పని చేస్తాం’
– జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత
రాజకీయంగా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక అక్రమంగా కేసులు పెట్టిన బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలేలా సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. లేనిపోని ఆరోపణలతో నిరూపితం కాని అంశాల్లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చి దర్యాప్తు సంస్థలు ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. కేవలం అప్రూవర్లు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కవితను ఏకంగా ఐదు నెలలకు పైగా అక్రమంగా జైలులో నిర్బంధించారు. ఎట్టకేలకు న్యాయ వ్యవస్థను నమ్ముకున్న బీఆర్ఎస్కు న్యాయం దక్కింది. కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి కార్యకర్తలంతా సంబురాలు చేసుకున్నారు.
ఈడీ కవితను మార్చి 15న అక్రమంగా అరెస్టు చేయగా, అదే క్రమంలో సీబీఐతోనూ అరెస్టు చేయించిన కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం పైశాచిక ఆనందాన్ని పొందింది. 165 రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించినప్పటికీ తప్పులను రుజువు చేయలేకపోయింది. రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారు చెప్పినట్లుగానే ఆడి పాడిన దర్యాప్తు సంస్థల వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కవితకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో ఈడీ, సీబీఐలకు తలంటింది.
ఖలీల్‌వాడి, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు మంగళవారం సంబురాలు నిర్వహించాయి. నిజామాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, పార్టీ నగర అధ్యక్షుడు సిర్పరాజు మాట్లాడుతూ న్యాయం ఎటువైపు ఉంటే అటే ధర్మాసనం మొగ్గు చూపుతుందన్నారు. ఉద్యమకారులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో మంగళవారం భారత జాగృతి నేతలు సంబురాలు జరుపుకొన్నారు. భారత జాగృతి నాయకుడు అవంతిరావు, ఉద్యమకారుడు చింత మహేశ్, ప్రవీణ్‌రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ పార్టీగా తెలంగాణలో స్థిరమైన నాయకత్వాన్ని పెంపొందించిన బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగింది. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను కేసీఆర్ సాకారం చేశారు. స్వరాష్ట్రంలో సీఎంగా పదేండ్ల కాలంలో తెలంగాణను పునర్నిర్మించారు. దేశ రాజకీయాల్లో అరంగేట్రం చేసి భావి భారత సమాజాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని భా రత రాష్ట్ర సమితికి కేసీఆర్ పురుడు పోశారు. పార్టీని విస్తరిస్తున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీకి కన్నుకుట్టినట్లయింది. బీఆర్ఎస్ ఎదుగుదలను ఓర్వలేక ఆదిలోనే అంతం చేయాలని కక్షపూరితంగా వ్యవహరించింది. ఇందులో భాగంగానే సంబంధం లేని కేసును తెరపైకి తీసుకొచ్చి, బీఆర్ఎస్ అధినేత కూతురు పేరు ను చేర్చి నైతికంగా దెబ్బకొట్టేందుకు పావులు కదిపారు.
ఏడాదిన్నర కాలంగా బీజేపీ చేసిన రాజకీయ ఎత్తుగడతో కవితకు ఇబ్బందులు తప్పలేదు. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా కేసులు బనాయించి విచారణ పేరుతో జైలుకు పంపి హింసించారు. బీఆర్ఎస్ను దెబ్బ తీయాలనే ఏకైక లక్ష్యంలో భాగంగానే బీజేపీ అనేక కుట్రలకు తెర లేపింది. ఇందుకు ఆ పార్టీ ఎంపీ లు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పదేపదే సీబీఐ, ఈడీ విచారణ తీరుపై అందరి కన్నా ముందుగానే ఈ ఇద్దరు ఎప్పటికప్పుడు జోస్యం చెబుతూ పైశాచికత్వాన్ని పొందారు. బీజేపీ ఎంపీలు చెప్పినట్లుగానే దర్యాప్తు సంస్థల తీరు కొనసాగడంతో కవితను ఇరికించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది.
దాదాపుగా ఆరు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన కవిత సడలని ధైర్యాన్ని ప్రదర్శిచారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో కేసు వాదనలో భాగంగా తరచూ మొక్కవోని ధైర్యాన్ని చూపెట్టారు. నిర్భంధాల మధ్యనే చేతిని బిగించి జై తెలంగాణ నినాదాన్ని ఢిల్లీ వేదికగా నినదించి కేసీఆర్ బిడ్డగా సడలని విశ్వాసాన్ని ప్రదర్శించారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు తీరును ఎండగడుతూనే, ఎప్పటికప్పుడు కుటిల ప్రయత్నాలపై గళం వినిపిస్తూ వచ్చారు. 165 రోజుల పాటు విశ్వాసం కోల్పోకుండా న్యాయస్థానాలపై నమ్మకంతో కవిత నిలబడి చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా బెయిల్ దక్కించుకున్నారు.
భారతదేశం మొత్తం ఆమె వైపు చూస్తున్నది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూ రు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూశారు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని ధర్మాసనం తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది. ఎమ్మెల్సీ కవితది అందరికీ సహాయం చేసే గుణం. ఆమెకు న్యాయం దక్కింది.
– దాదన్నగారి మధుసూదన్‌రావు, న్యాయవ్యాది
ఎమ్మెల్సీ కవిత కోసం రాష్ట్ర మహిళాలోకం ఎదురుచూస్తున్నది. బెయిల్ మంజూరు కావడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. మహిళల కోసం, మహిళా సంక్షేమం కోసం పాటుపడే ఎమ్మెల్సీ కవిత వెంటే న్యాయం, ధర్మం నిలిచింది.
– విశాలిని రెడ్డి, మాజీ కార్పొరేటర్