బోధన్/శక్కర్‌నగర్/ బోధన్‌రూరల్/రెంజల్, నవంబర్ 27: బోధన్, నవంబర్ 27 : సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు కావాల్నా లేక రాబందులు కావాల్నా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణా కన్నా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లయితే తాము ప్రజల్ని ఓట్లు అడగగమని, తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏదైనా రాష్ట్రంలో వచ్చినట్లు రుజువుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్, రెంజల్ బేస్, షఫీ చమాన్, అంబేద్కర్ కాలనీ ప్రాంతాలతోపాటు బోధన్ మండలంలోని బెల్లాల్, అమ్దాపూర్, ఊట్పల్లి, భవానీపేట్, సంగం, మీనార్‌పల్లి, సాలూరా మండలకేంద్రంతోపాటు హున్సా, సాలంపాడ్, రెంజల్లో ప్రచారం నిర్వహించారు.
బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌కు 22 వేల బహుళజాతి కంపెనీలను తీసుకువచ్చామని, దాదాపు 32 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ప్రభుత్వరంగంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేశామని, అందులో 1.6 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారని వివరించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న అడ్దుకునే శక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేదని, సకాలంలో ఎరువులను సరఫరాచేయలేదని, వడ్లు కొనుగోలు చేయలేదని ఎత్తిచూపించారు.
పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జైభీమ్ అవుతుందని ఎద్దేవా చేశారు. బీడీ కార్మికులతో సహా అన్నిరకాల పింఛన్లను రూ.5 వేలకు పెంచాలని, కట్ఆఫ్ డేట్‌తో సంబంధంలేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట నెలకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులను సరిదిద్ది, కొత్తరేషన్ కార్డులు జారీచేసిన తర్వాత రైతుబీమా తరహాలో పేదలకు రూ.5 లక్షల మేరకు ‘కేసీఆర్ రక్ష’ పేరిట కొత్తగా బీమా పథకం అమలుచేస్తామని, రూ.15 లక్షల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులో వైద్య చికిత్సలు చేయించుకునే సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ తలపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్మమంత్రి కాగానే, రైతుబంధు మొత్తం రూ.16 వేలకు పెరుగుతుందని, ఎన్నికల తర్వాత రేషన్ షాప్‌ల ద్వారా సన్నబియ్యం పంపిణీచేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.400కు ఇస్తామన్నారు. స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని తెలిపారు. రానున్న ఐదేండ్లలో పెద్ద సంఖ్యలో ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. బోధన్‌లో నిజాంషుగర్స్ భూములకు పట్టాలు చెప్పారు. మంచి మనిషి, బోధన్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
బోధన్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాన్ని అందించామని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు తనను మళ్లీ ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.