– సమ్మె హెచ్చరికతో యాజమాన్యానికి అల్టిమేటం
– బస్సు యాత్ర, గేట్ మీటింగ్‌లతో ఉద్యమం ముమ్మరం
రుద్రంపూర్, మార్చి 17 : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) గళమెత్తింది. మెడికల్ బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు, సొంత ఇల్లు, ఐటీ రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేస్తూ ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపునిచ్చింది. మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మైన్స్ విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం యాజమాన్యానికి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వీకే వర్క్‌షాప్‌లో పిట్ కార్యదర్శి మధు కృష్ణ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ.. కార్మికుల కష్టంతో సంస్థ లాభాల్లోకి వస్తున్నప్పటికీ వారి సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు. కార్మికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న సమస్యలపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
– జూలై 2025 నుండి పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డులను వెంటనే పూర్తి చేయాలి
– అనారోగ్యంతో ఉన్న కార్మికులను ‘అన్‌ఫిట్’గా ప్రకటించి వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలి
– ఉద్యోగులందరికీ సొంత ఇల్లు పథకం అమలు చేయాలి
– ఐటీ రీయింబర్స్‌మెంట్‌ను అధికారుల మాదిరిగా కార్మికులకు కూడా వర్తింపజేయాలి
– సంస్థకు రావాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
– బొగ్గు తవ్వకాలను ప్రైవేట్‌కు అప్పగించకుండా సింగరేణే నిర్వహించాలి
– పేర్లలో తప్పులు, మారుపేర్ల సమస్యలు పరిష్కరించి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
– పాత క్యాడర్ స్కీమ్‌ను సవరించి కార్మికులకు అనుకూలంగా మార్చాలి
ఈ నెల 17 నుండి 31 వరకు గోలేటి నుండి సత్తుపల్లి వరకు బస్సు యాత్ర నిర్వహించి కార్మికులను చైతన్య పరచనున్నట్లు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్‌లో భారీ స్థాయిలో సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆఫీస్ బేరర్ సందేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికులు యూనియన్లకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పిట్ కార్యదర్శి మధు కృష్ణ మాట్లాడుతూ.. బస్ యాత్ర, హెడ్ ఆఫీస్ ముట్టడి, సమ్మె కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వర్క్‌షాప్ హెచ్ఓడీ క్రిస్టోఫర్‌కు మెమొరాండం అందజేయగా, సమస్యలను పై అధికారులకు తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, అప్రెంటిస్‌లు, డీఎల్ఆర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై గర్జించిన ఏఐటీయూసీ