బీబీనగర్, మార్చి 17 : ప్రభుత్వ పథకాల అమలు సమర్థంగా జరగాలని యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని నర్సరీతో పాటు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం, సంరక్షణ విధానాలు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అలాగే ఆరోగ్య ఉప కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యత, రోగుల నమోదు తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత, పారిశుధ్యంలో విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
సర్పంచ్, పాలకవర్గం ఐక్యతతో పనిచేసి గూడూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సీఈవో సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ జడ్పీ సీఈఓ శోభారాణిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు భాషబోయిన బాలప్రసాద్, తోరుపునూరి అశ్విని, బాలరాజ్ గౌడ్, దంతూరి శ్రీనివాస్ గౌడ్, కసగోని అరుణ సత్యంగౌడ్, బింగి సంజయ్‌కుమార్, అంకర్ల శ్రీనివాస్, బింగి లావణ్య రమేశ్, దొనకొండ శ్రీరాములు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి : జడ్పీ సీఈఓ శోభారాణి