బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ బాన్సువాడ రూరల్ 12: పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుభరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో పోచారం ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా ఆ పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలని నిలదీశారు. ఆదివారం ఆమె బాన్సువాడలో పర్యటించారు. బాన్సువాడ కొయ్యగుట్ట వద్ద అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం కవితకు ఆటోలు, బతుకమ్మ, బోనాలతో, బ్యాండ్ మేళాలు, బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీని గజమాలతో సత్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున కేసీఆర్ రూ.పదివేల కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదికి రూ.వెయ్యి కోట్లు పోచారం తీసుకురాగలరా అని ప్రశ్నించారు. ప్రజలకు పనికిరాని పార్టీ మారడం ఎందుకని ప్రశ్నించారు. కొంతమంది నాయకులు పార్టీ మారినా బీఆర్ఎస్తో ప్రజలు, కార్యకర్తలు ఉన్నారని అన్నారు. బాన్సువాడతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్
రైతుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కాని, చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని రూ.12వేలే ఇస్తున్నారని మండిపడ్డారు. మహిళలు, ఆటో డ్రైవర్లు, కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కిందన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
గడిచిన ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్టులో కూడా తట్ట మట్టికూడా ఎత్తిపోయలేదన్నారు. గురుకులాల్లో భోజనం సరిగ్గాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో విషాహారం తిని విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ నాయకులు సత్యం పటేల్, షేక్ జుబేర్, మోచి గణేశ్, సాయిబాబా, గంగాధర్, శివసూరి, గౌస్, అఫ్రోజ్, సద్దాం, చాకలి సాయిలు, చాకలి మహేశ్, మౌలానా, రాము, నర్సింహులు గౌడ్, శ్రీను, కోటగిరి మధు, రుద్రూర్ మధుసూదన్ రెడ్డి, జలాల్ పూర్ ప్రవీణ్, శ్రీను, వర్ని ఏజాస్, మాజీ సర్పంచ్ దామరంచ విఠల్ పాల్గొన్నారు.
బడాపహాడ్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ
ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
Kavithaa
రుద్రూర్, జనవరి 12: ఉర్సులో భాగంగా వర్ని మండలం బడాపహాడ్‌లో ఉన్న హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గాను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. స్థానిక, జిల్లా నాయకులతో కలిసి బడాపహాడ్ కు చేరుకున్న కవిత ముందుగా బుగ్గ రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మెట్లమార్గాన కాలినడకన దర్గాకు వెళ్లి సంధాల్, చాదర్‌ను సమర్పించారు. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ బాన్సువాడ నాయకులు జుబేర్, అశోక్, ఎజాజ్‌ఖాన్ తదితరులు ఉన్నారు.