ఖలీల్వాడి, జూన్ 19 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో హైదరాబాద్లో గురువారం భేటీ అయ్యారు. తిరుపతిలోని హథీరాం భావాజీ మఠంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించడంతోపాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. త్వరలోనే హథీరాం భావాజీ మఠం నిర్వాహకులు, గిరిజ పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు. మఠంలో పూజలు చేయడానికి హారతినివ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 30న హథీరాం భావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు.