డిచ్పల్ల్లి, ఏప్రిల్ 15: ఎవరో భిక్ష పెడితేనో, ఎవరో దయ తలిస్తేనో తెలంగాణ రాలేదు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ వల్లే తెలంగాణ కల సాకారమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో డిచ్‌పల్లిలో మంగళవారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులనుద్దేశించి కవిత మాట్లాడారు.
ఉద్యమ సత్తా చూపిన బీఆర్ఎస్
దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినా అవి ముందుకు సాగలేదని, కానీ తెలంగాణ సాధన కోసం స్థాపించిన బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నదని కవిత తెలిపారు. మన ఉద్యమ సత్తా దేశానికి చూపించామన్నారు. ‘మీరు చాలా అదృష్టవంతులు. అనేక మంది ఉద్యమాలు చేస్తారు. కానీ అవి సఫలం కావు. మధ్యలోనే ఆగిపోతాయి. కానీ మీరు చేసిన పోరాటం ఫలించిందని’ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్‌ను ప్రశంసించిన విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తున్న సమయంలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ బక్క మనిషి అయినా మొండి మనిషి అని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మనకెందుకు దీక్షలు అన్నా వినకుండా ప్రాణాలకు తెగించి దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అన్న నినాదంతో పోరాటం చేశారన్నారు.
స్వరాష్ట్రం కోసం 36 పార్టీలను కేసీఆర్ ఒప్పించారని, మాయావతిని ఒప్పించడానికి 50 సార్లు వెళ్లారని గుర్తు చేశారు. పసుపుబోర్డు కోసం 36 పార్టీలతో చర్చించి, పసుపు రైతుల గోడును వారికి వినిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేసీఆరేనని తెలిపారు. తెలంగాణలో బలిదానాలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హోటళ్లలో కూర్చుని బిర్యానీలు తినడం తప్ప రాష్ట్రం కోసం ఏ ఒక్కరోజూ మాట్లాడలేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందన్నారు.
ఇద్దరు కలిసి దోచుకుంటుండ్రు..
కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని ప్రజలను దోచుకుంటున్నాయని కవిత విమర్శించారు. మళ్లీ 30 ఏండ్ల దాకా అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ వాళ్లకు తెలుసన్నారు. అందుకే రాష్ర్టాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో 20 శాతం కమీషన్ అని ఢిల్లీలో చెప్పుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి నిధులు తీసుకురాలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో పసుపుబోర్డు కోసం రూపాయి కూడా కేటాయించలేదని, పసుపుబోర్డుకు చట్టబద్ధత ఇప్పటివరకు తీసుకురాలేదని విమర్శించారు. వరంగల్‌లో 27న జరిగే రజతోత్సవ సభకు ప్రతి ఊరి నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు.
ఇందూరు బిడ్డవే అయితే చట్టబద్ధత తేవాలి
బీజేపీ ఎంపీ అర్వింద్ ఇందూరు బిడ్డనే అయితే పసుపుబోర్డుకు చట్టబద్ధత తీసుకురావాలని కవిత సవాల్ విసిరారు. పసుపుబోర్డు తీసుకొచ్చామని బీజేపీ చెబుతున్నప్పటికీ, కేంద్ర బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదన్నారు. అన్ని రకాల బోర్డులకు పార్లమెంట్ చట్టం చేస్తే, పసుపుబోర్డును మాత్రం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి పైసా ఇవ్వలేదని, కాంగ్రెస్, బీజేపీలకు 8 ప్లస్ 8 ఎంపీలు ఉన్నప్పటికీ జీరో అయ్యారని ఎద్దేవా చేశారు. కేంద్రం పైసా ఇవ్వక పోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కుని దోచుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ 3.0 వర్షన్ అని తెలిపారు.
అర్వింద్ చేసింది ఏముంది?
కాంగ్రెస్, బీజేపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆరోపించారు. దమ్మున్న లీడరంటే మాజీ సీఎం కేసీఆరేనని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. పసుపుబోర్డు తీసుకొస్తానని చెప్పి, బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన బీజేపీ ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పసుపుబోర్డు పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదన్నారు. పసుపుబోర్డు నేమ్ ప్లేట్ నిజామాబాద్‌లో, ఆఫీస్ ఢిల్లీలో అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి వచ్చిందని, 30 ఏండ్ల వరకు ప్రజలు ఆ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగమైతే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు దొంగ హామీలిచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగితే కేసీఆరే సీఎం అవుతారని అందరూ చెబుతున్నారన్నారు.
హామీల అమలేది?
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం లేదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి 28 మంది ఎమ్మెల్యేలు వస్తారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరితే కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి ఆశీర్వాదంతోనే మళ్లీ గెలిచి అధికారంలోకి వద్దామని చెప్పారన్నారు. ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే ప్రతి దందాలో పైసలు వసూలు చేస్తున్నాడని, ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి ప్రజలు చెబుతున్నారని బాజిరెడ్డి తెలిపారు. ఇసుక, ఇటుక, మొరం వంటివే కాకుండా సొసైటీల్లో కూడా కమీషన్ కోసం కక్కుర్తి పడ్డ ఘనత భూపతిరెడ్డికే దక్కుతుందన్నారు. తాను గతంలో రూ.151 కోట్ల నిధులు తీసుకొస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చింతల నాగారం చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, ఏప్రిల్ 15: బాన్సువాడపట్టణానికి సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్‌డ్యాంను ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హ యాంలోనే బాన్సువాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆమె అన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి ఇక్కడి జరిగిన అభివృద్ధే సాక్ష్యమని తెలిపారు. మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం.. కేసీఆర్ తెలంగాణను పచ్చగా మార్చడానికి పడిన తపనను గుర్తు చేస్తున్నదని కవిత పేర్కొన్నారు.
వ్యవసాయ కూలీలతో ముచ్చటిస్తూ..
బాన్సువాడ, ఏప్రిల్ 15: చింతలనాగారం చెక్‌డ్యాం సందర్శన అనంతరం తిరిగివస్తుండగా పంట చేలలో పనిచేస్తున్న కూలీలు, మహిళల వద్ద వాహనం ఆపి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. మిషన్ భగీరథ నీరు పచ్చగా వస్తున్నదని, డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని, ఉన్నవారికే ఇచ్చారని పలువురు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ మన సర్కార్ వస్తుందని, అప్పుడు కట్టుకుందామని కవిత వారికి భరోసా ఇచ్చారు.
కేసీఆర్ సారు బాగుండే అని, ఇప్పుడు పనులు అయితలేవని, పెన్షన్లు వస్తలేవని మరికొందరు చెప్పారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కత్తి ఒక్కరికి ఇచ్చి , యుద్ధం వేరొకరిని చేయమంటే కరెక్టా అని అడుగగా, తామంతా కారు గుర్తుకు ఓటు వేశామని మహిళలు చెప్పారు. రాబోవు రోజుల్లో మనం మళ్లీ అధికారంలోకి వస్తామని, అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.