ఖలీల్‌వాడి, జనవరి 12: మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మైనార్టీలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అర్సపల్లిలోని శైలజ గ్రౌండ్లో కొనసాగుతున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు హాజరయ్యారు. సారంగపూర్ సమీపంలో తబ్లిగి జమాతే ఇస్తేమా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని అన్నారు. మైనార్టీల నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ముచేసిందని విమర్శించారు. గద్దెనెక్కేందుకే కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలను ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో మైనార్టీలకు హామీలు ఇచ్చి మరిచిపోయారన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. వెంటనే మైనార్టీ డిక్లరేషన్‌ను అమలుచేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో వెల్లివెరిసిన మత సామరస్యం
పదేండ్ల కేసీఆర్ పాలనలో మతకల్లోల జాడ కనిపించలేదని, రేవంత్ ఏడాది పాలన ఆందోళన కలిగిస్తుందన్నారు. మతకల్లోలాలు జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గంగా జమునా తెహజీబ్‌లో ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారన్నారు. మైనార్టీ యువతులకు స్కూటీలతో పాటు షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలుచేయడంలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. మైనార్టీలకు బడ్జెట్లో కనీసం 25శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. బడ్జెట్లో రూ. 3వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. షాదీ ముబారక్ కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇప్పు డు ముఖం చాటేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట
మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో తబ్లిగి జమాతే ఇస్తేమా కార్యక్రమానికి కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా షబ్బీర్ అలీ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇన్చార్జిగా కొనసాగుతున్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా మైనార్టీలు ఉన్న నిజామాబాద్ అర్బన్‌కు షబ్బీర్‌అలీ అదనంగా రూపాయి కూడా ఇప్పించలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా, నగర మేయర్ దం డు నీతూకిరణ్, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్ఎస్ మైనార్టీ విభా గం నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాజ్, మాజీ జడ్పీటీసీ జగన్, నాయకులు పాల్గొన్నారు.