నగరం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పదేండ్లుగా నగరం ప్రశాంతంగా ఉందని..కండ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఓట్లు దండుకోవడానికి కుట్రలకు తెరలేపారన్నారు. దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ
పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నదన్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గణేశ్ గుప్తాను మరోసారి ఆశీర్వదించాలన్నారు.
ఖలీల్‌వాడీ, నవంబర్ 28 : పట్టణాభివృద్ధిలో మరింత దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాను గెలిపించుకుందామని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాతో కలిసి నగరంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. గణేశ్‌గుప్తాను గెలిపించుకుందాం, నిజామాబాద్‌ను కాపాడుకుందామన్నారు.పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చామని, దాంతో దాదాపు 1500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. కర్ణాటకలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకాలు చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తాయని, తప్పుడు మాటలు మాట్లాడుతారని, వాటిని నమ్మవద్దని కోరారు.పిల్లల భవిష్యత్తుపై ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5వేలకు పెంచాలని, కటాఫ్ డేట్‌తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ.15 లక్షల వరకు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయిన తర్వాత రైతుబంధు మొత్తం రూ.16 వేలకు పెరుగుతుందని ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. గణేశ్‌గుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ నగరంలో తొమ్మిదేండ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 9 సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రశాంతంగా ఉందని, మీ అందరికి తెలుసని, ఎలాగైనా గెలవాలని కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై డ్రామాలు చేస్తున్నాయని.. గొడవలు సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. అభివృద్ధిని ఆదరిస్తూసంక్షేమాన్ని కొనసాగించడం కోసం నగరం శాంతియుతంగా ఉండడం కోసం కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, సుజిత్‌సింగ్ ఠాకూర్, రవిచందర్, సత్యప్రకాష్ పాల్గొన్నారు.