మోర్తాడ్/ముప్కాల్, డిసెంబర్ 13: సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి బేషజాలకు పోకుండా మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. శుక్రవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శన, సమీక్షకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిసి పలు విజ్ఞాపనలు అందజేశారు. అనంతరం వేముల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సాగునీటి విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం కుంగిందని, ఎక్కడో చిన్న డ్యామేజీ జరిగిందని ఇంకెన్నాళ్లు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగింది అని చెబుతున్నారు. ఏడాది కాలమై పోయింది. ప్రభుత్వం బేషజాలకు పోకుండా అక్కడ మరమ్మతులు చేపట్టి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. ‘మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచింది. ఇంకా మా మీద బురద జల్లడం ఆపి మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వండని’ కోరారు. మేడిగడ్డ దగ్గర రిపేర్ చేస్తే సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులతో పాటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకు రావొచ్చన్నారు. ఎస్సారెస్పీ ఫేజ్-2తో పాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక్‌సాగర్ ప్రాజెక్టులను నింపుకోవచ్చని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 20, 21, 21 ఏ ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రూ.5,800 కోట్లతో చేపట్టనున్న ఆయా పనులతో బాల్కొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1.14 లక్షలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6 వేల ఎకరాలకు నీళ్లివ్వవచ్చన్నారు. తమ హయాంలో దాదాపు రూ.3,300 కోట్లు ఖర్చు పెట్టి 60 శాతం పనులు పూర్తి చేశామని, మిగతా పనులు సత్వరమే పూర్తి చేయాలని మంత్రికి విన్నవించారు. చిట్టాపూర్-ఫత్తేపూర్-సుర్భిర్యాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను వేగవంతం చేయాలని కోరారు.
బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో 9,274 ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకంలో సిమెంట్ పైప్లైన్లు వాడడం వల్ల తరచూ లీకేజీలు అవుతున్నాయని, దీంతో చివరి చెరువు వరకు నీరు చేరడం లేదన్నారు. సిమెంట్ పైప్‌లైన్‌ను దశల వారీగా ఎంఎస్ పైప్‌లైన్‌గా మార్చాలని కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనేక గ్రామాల ప్రజలు త్యాగాలు చేశారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో మెగా టూరిజం ప్రాజెక్టు చేపడితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే మెగా టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు స్థలం గుర్తించి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు బోట్ నడపడానికి ట్రయల్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని వేముల మంత్రిని కోరారు.