బాన్సువాడ టౌన్, మే 14: ఎప్పుడైనా తాను, తన కుటుంబం పక్కా లోకల్ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన పోచారం మంగళవారం ఉదయం బాన్సువాడ పాత మున్సిపల్ కార్యాలయం కాంప్లెక్స్‌లోని ఇమ్రాన్ టీ పాయింట్ వద్ద స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి చాయ్ తాగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురితో ముచ్చటిస్తూ ఎన్నికలు వస్తాయి పోతాయి, నాన్ లోకల్ నాయకులు ఓట్ల కోసం వస్తారు.. పోతారు కానీ కలకాలం బాన్సువాడ ప్రజలతో కలిసి ఉండేది తానేనని, తాను పుట్టింది బాన్సువాడలోనే, ఇక్కడి ప్రజలే తన కుటుంబమని తెలిపారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా బాన్సువాడ ప్రజలతో అనునిత్యం కలిసి జీవిస్తానని అన్నారు. అక్కడే మామిడి పండ్లు అమ్ముతున్న ఒక పెద్దావిడా వచ్చి పోచారం పటేలా నా సొంత చెట్టుకు కాసిన పండ్లు మీరు తినండి అంటూ ఇవ్వడంతో పోచారం సంతోషం వ్యక్తంచేశారు. పోచారం వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఎజాస్, వాహెబ్, నార్ల రవీందర్, ఉదయ్ తదితరులు ఉన్నారు.