బాన్సువాడ, సెప్టెంబర్ 26: రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కల్మశం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాన్సువాడలోని మున్సిపల్ కార్యాలయంలో ఇందిర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటిన్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.
అలాగే, బీర్కూర్ మండలంలోని మిర్జాపూర్ మహిళాసంఘ సభ్యులకు గానుగ మిషన్‌ను అందజేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. కలుషితమైన ఆహారం తినడం ద్వారా రోగాలను కొని తెచ్చుకుంటామని, చికిత్స కోసం దవాఖానల్లో రూ.లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారన్నారు. మహిళా సమాఖ్య సభ్యులు నాణ్యమైన నూనె, ఇతర ఉత్పత్తులను తయారుచేసే ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించుకోవాలన్నారు.
ఆయా ఉత్పత్తులను ప్రభుత్వ వసతిగృహాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని పోచారం హామీ ఇచ్చారు. ఆడబిడ్డల చేతికి డబ్బులు ఇస్తే రూపాయికి అదనంగా మరో రూపాయి జమ చేస్తారని, అందుకే బ్యాంకులు వాళ్లకు విరివిగా రుణాలను ఇస్తున్నాయని చెప్పారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పోచారం సమీక్షించారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు వరప్రసాద్, యాదిరెడ్డి, మోహన్‌రెడ్డి, రవిశంకర్ పాల్గొన్నారు.