కామారెడ్డి, జూన్ 7: నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్ చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై సమీక్షిస్తుండగా టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే పోచారం సూచించారు.
రైతులకు సరిపడా పచ్చి రొట్ట విత్తనాలు అందించాలని సూచించగా ఇప్పటి వరకు 4,600 క్వింటాళ్ల జీలుగ, 1,343 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందజేశామని, అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ జితేశ్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని రైతులకు తెలిపి సన్నధాన్యం పండించేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కల్పించాలని పోచారం అన్నారు.

కొత్త మండలాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు పెరిగేలా చూడాలన్నారు. సదరం స్లాట్ బుకింగ్‌లో సాంకేతిక కారణాలతో దివ్యాంగులు నష్టపోకుండా చూడాలని కోరగా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు.
విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 947 పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, చిన్నపాటి మరమ్మతు పనులు గుర్తించి చేపట్టామన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి బాధపడుతున్న రైతుల నుంచి క్వింటాలుకు 5కిలోల చొప్పున తరుగు తీయడం బాధాకరమని, వచ్చే సీజన్లోనైనా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు చేయాలని సభ్యులు సూచించారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నా చౌకధరల దుకాణాల ద్వారా దారుణమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని, వసతి గృహాలు,పాఠశాలల్లో విద్యార్థులు భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదే చివరి జడ్పీ సమావేశమని, ఐదేండ్ల నుంచి సభలు,సమావేశాలు సజావుగా నిర్వహించి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో చందర్‌నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, జిల్లా అధికారులు భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్, విజయలక్ష్మి, రాజు, నిత్యానందం, హనుమంతరావు, రవి శంకర్, రాజేంద్ర కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.