చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూములు బీడుగా మారాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసు కట్టు చెరువులు సాగుకు ప్రాణం. కానీ నాటి పాలకులు వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో ఆయకట్టంతా నెర్రెలు బారేది. అన్నదాతలు, కూలీలు ఉపాధి కోసం వలస బాట పట్టేవారు. కానీ స్వ రాష్ట్రం సాధించుకున్న తర్వాత చెరువులను బతికించేందుకు.. చెరువులపై ఆధారపడిన కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే దిశగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఇందుకు పాత నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌లోని పాత చెరువు వేదికైంది. మార్చి 12, 2015 తేదీన స్వయంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ కింద చెరువులు పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెరువులన్నీ మరమ్మతులకు నోచుకోవడంతో పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. దీంతో ఆయకట్టు రైతుల్లో భరోసా నిండింది. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాలు సైతం పెరగడంతో బోర్ల కింద అన్నదాతలు రెండు పంటలను పండిస్తున్నారు. 365 రోజులు చెరువులు నిండుగా ఉండడంతో జలపుష్పాలతో తొణికిసలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఫలాలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలు..
మిషన్ కాకతీయ కింద రూ.56.50లక్షలతో పనులు
ధర్పల్లి, ఫిబ్రవరి 20: ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామానికి ప్రధాన చెరువు అయిన సదర్ (ఊర చెరువు) మరమ్మతుల కోసం మిషన్ కాకతీయలో భాగంగా రూ.56.50లక్షలు కేటాయించారు. చెరువుకు మరమ్మతులు చేపట్టడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తద్వారా సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు ఉపయుక్తంగా మారింది. చెరువు పూడిక తీసి మరమ్మతులు చేపట్టడంతో జలకళను సంతరించుకున్నది. ఒకవైపు ఆయకట్టు సాగు పెరగడంతోపాటు మత్స్యకారులకు సైతం ఉపయోకగరంగా మారింది. గతంలో ఆయకట్టు కింద సుమారు 200, 300 ఎకరాల్లో పంటలను సాగు చేయగా ప్రస్తుతం సాగు విస్తీర్ణం రెట్టింపు కావడంతో రైతులు, మత్స్యకారుల ఆదాయం పెరిగింది.
600 ఎకరాలకు సాగునీరు…
ఒకప్పుడు చెరువు కింద ఆయకట్టు పరిధి అంతంత మాత్రంగానే ఉండేది. మిషన్ కాకతీయ కింద పూడికతీసి మరమ్మతులు చేపట్టడంతో ఆయకట్టు సాగు విస్తీర్ణం రెట్టింపయ్యిందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సుమారు 600ఎకరాలకు ఒక్క సీజన్లో రైతులు 18వేల క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. దీనికితోడు ప్రతియేడు ప్రభుత్వమే సబ్సిడీపై సదర్ చెరువులో 63వేల చేప పిల్లలను వదులుతున్నది. దీని ద్వారా గంగపుత్రులు ఉపాధి పొందుతూ లాభాలను గడిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవంతోపాటు గ్రామాలు పచ్చదనం,పుష్కలమైన భూగర్భజల వనరులు, ఆదాయ వనరులతో అభివృద్ధి చెందుతున్నాయి.
సాగు విస్తీర్ణం పెరిగింది..
మిషన్ కాకతీయ కింద చెరువు పూడికతీసి మరమ్మతులు చేపట్టడంతో నీ టి నిల్వ సామర్థ్యం పెరిగి గ్రామాల్లో భూగర్భజల వనరులు సైతం పెరిగా యి. సాగు విస్తీర్ణం 600ఎకరాలకు చేరుకున్నది. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో చెరువుకు నిధులు కేటాయించడం ద్వారా పూడిక తీసి మరమ్మతులు చేసుకోగలిగాం. చెరువు బాగు పడింది. పంటలు బాగా పండుతున్నాయి.
– రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, రామడ్గు సొసైటీ
భూగర్భ జల వనరులు పెరిగాయి
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు బాగయ్యాయి. భూగర్భజల వనరులు పెరిగాయి. పంటలు సైతం బాగా పం డుతున్నాయి. చెరువుల మరమ్మతుతో సాగు, తాగునీరుకు ఢోకా లేకుం డా పోయింది. ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు ఎన్నటికీ మరిచిపోలేరు. పచ్చని పంటలతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
– సోమ శేఖర్, రైతు, మైలారం
బాల్కొండ పెద్దచెరువు
బాల్కొండ, ఫిబ్రవరి 20: బాల్కొండ మండల కేంద్రంలోని పెద్దచెరువు ఇది. మిషన్ కాకతీయ మొదటి విడుతలో చెరువు పునరుద్ధరణకు రూ.51.50లక్షలు మంజూరయ్యాయి. చెరువు తూములు, అలుగు మరమ్మతులు చేశారు. పూడికతీత చేపట్టి సైడ్‌వాల్స్ నిర్మించారు. మరమ్మతుల అనంతరం దాదాపు 383 ఎకరాలకు రెండు పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కుడి చెరువుకు జలకళ
దోమకొండ, ఫిబ్రవరి 20: దోమకొండ మండల కేంద్రంలోని కుడి చెరువును మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేశారు. షట్టర్ల బిగింపు, కట్ట బలోపేతం పనులు చేశారు. చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.42లక్షలు మంజూరు చేసింది. చెరువు కింద సుమారు 210ఎకరాల ఆయకట్టు ఉండగా వానకాలం, యాసంగిలో సాగు సవ్యంగా కొనసాగుతున్నది. మరోవైపు చెరువు పునరుద్ధరణతో మత్స్యకారులు, రజకులు సైతం సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వర్షాలకు చెరువు సమృద్ధిగా నిండి రెండు పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు సంబురపడుతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
నాడు 30 బస్తాలు.. నేడు 50 బస్తాల దిగుబడి
ఇదీ ఊట్పల్లి చెరువు ఆయకట్టు ఫలితం
బోధన్ రూరల్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతుల పాలిట వరంగా మారింది. గతంలో ఒక్క పంట సైతం సరిగా పండించలేని రైతులు మిషన్ కాకతీయ పథకం ద్వారా రెండు పంటలను పండించుకునే స్థాయికి చేరుకున్నారు. బోధన్ మండలంలోని ఊట్పల్లి చెరువు పునరుద్ధరణ పనులకు మిషన్ కాకతీయ పథకం కింద రూ.36లక్షలు వెచ్చించారు.చెరువులో పూడికతీయడంతోపాటు కట్టబలోపేతం, తూములను బాగు చేయించారు. పూడిక మట్టిని రైతుల పంట పొలాల్లో వేయడంతో భూసారం పెరిగింది. ఆయకట్టు విస్తీర్ణం 150ఎకరాలు కాగా గతంలో కేవలం 70ఎకరాలు మాత్రమే సాగు అయ్యేది. మిషన్ కాకతీయ కింద పనులు పూర్తికావడంతో ప్రస్తుతం పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది . రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు ఉండడంతో దిగుబడులు కూడా పెరిగాయి. గతంలో 30 నుంచి 40 బస్తాలకు మించని దిగుబడి, ప్రస్తుతం 50 బస్తాల వరకు వస్తుందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఆదాయం రెట్టింపు అయ్యింది. చెరువు నిండుకుండలా మారడంతో చుట్టు పక్కల భూగర్భ జలమట్టం పెరిగి బోరు మోటార్లకు సమృద్ధిగా నీరందుతున్నది.
రెండు పంటలను పండిస్తున్నాం
మిషన్ కాకతీయ పథకం కన్నా ముందు ఒక పంటను పండించాలంటేనే చాలా కష్టంగా మారింది. దిగుబడి కూడాఎకరానికి 25 నుంచి 30 బస్తాలు మాత్రమే వచ్చేవి. చెరువులో పనులు చేపట్టిన తర్వాత రెండు పంటలను పండించుకునే వీలు కలిగింది. పుష్కలంగా నీరు అందడంతో పంటలు బాగా పండి దిగుబడి పెరిగింది. ప్రస్తుతం ఎకరానికి 40 నుంచి 50 బస్తాలను పండిస్తున్నాం. దీంతో ఆదాయం రెట్టింపు అయ్యింది. మిషన్ కాకతీయ మాకు వరంగా మారింది.
– పోతారెడ్డి, రైతు, ఊట్పల్లి
మిషన్ కాకతీయతో పంటలకు భరోసా
కొన్నేండ్ల కిందట చెరువు ఆయకట్టు కింద పంటలను సాగు చేయాలంటే సాహసంగా భావించేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద చెరువు పూడికతీత పనులు చేపట్టిన తర్వాత జలవనరులు పెరిగాయి. దీంతో ఒక్క పంట కాదు రెండు పంటలు పండించుకునేందుకు భరోసా ఏర్పడింది. పుష్కలంగా నీటి వనరులు ఉండడంతో రెండు పంటలను ఇబ్బంది లేకుండా పండిస్తున్నాం.
– ఆర్.స్వామి, ఆయకట్టు రైతు, ఊట్పల్లి
నిండుకుండలా మైలారం గ్రామ చెరువు
పారుతున్న పంట కాలువ
నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి చెరువు నిండుకుండను తలపిస్తున్నది. ఇం దులో భాగంగా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ ఊర చెరువులో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రభు త్వం మంజూరు చేసిన రూ.43లక్షలతో పూడికతీత, తూము మరమ్మతులు, పంట కాలువ నిర్మాణం, కట్ట బలోపేతం, మెట్ల అలుగును నిర్మించారు. గతంలో 400ల ఎకరాలకు వచ్చే నీటి సదుపాయం, మిషన్ కాకతీయ పనుల అనంతరం 600ఎకరాలకు సాగునీరందిస్తున్నదీ చెరువు.
కోటగిరి, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన్న ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా గ్రామీణ చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. ఏండ్ల తరబడి పూడుకుపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసి బీడుగా మారిన భూములను సాగులోకి తీసుకొచ్చింది. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఈ పథకంపై రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో 2016 సంవత్సరంలో మొదటి విడుతలో మిషన్ కాకతీయ పథకం కింద 20 చెరువులకు సుమారు.రూ10 కోట్లు నిధులు మంజూరు కాగా రెండో విడుతలో మరో 18 చెరువులకు రూ.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో ఎంపికైన కోటగిరి నల్ల చెరువు పనులు పూర్తి కావడంతో ఆయకట్టు కింద వరి సాగు మరింత పెరిగింది. గతంలో నల్ల చెరువు కింద 750 ఎకరాలు మాత్రమే సాగు అయ్యేది. మిషన్ కాకతీయతో పూడికతీయగా నీటి సామర్థ్యం పెరిగి ఆయకట్టు విస్తీర్ణం కూడా మరో 200 ఎకరాలు పెరిగింది.
నల్ల చెరువుకు కొత్తగా ఏర్పాటు చేసిన తూము
నల్ల చెరువులో చేపట్టిన పనులు..
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 2016 సంవత్సరంలో మొదటి విడుతలో ఎంపికైన నల్ల చెరువు మరమ్మతుకు రూ.69లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువులో పూడికతీత, అలుగు నిర్మాణం, పాత తూమును తొలగించి కొత్తగా తూమును నిర్మించారు. సాగునీరు వృథా కాకుండా సరాసరిగా రైతుల పొలాల్లోకి వెళ్లేందుకు చెరువు కాలువలను సీసీతో నిర్మించారు. చెరువు కట్టపై మొరం వేసి బలోపేతం చేశారు. ప్రస్తుతం నల్ల చెరువు కళకళలాడుతూ మత్స్యకారులు, చాకలి, మూగజీవాలు, రైతులకు ఎంతో మేలు చేస్తున్నది.
రైతులకు వరం
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి చెరువు పూడిక తీయకపోవడంతో నీటి సామర్థ్యం తగ్గింది. నాడు కేవలం 650ఎకరాలు మాత్రమే సాగులో ఉండేది. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తొలగించడంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. నీటి నిల్వ పెరిగింది. నల్ల చెరువు పునరుద్ధరణకు కృషి చేసిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
– పత్తి లక్ష్మణ్, సర్పంచ్,కోటగిరి
మిషన్ కాకతీయతో రెండు పంటలు పండుతన్నయ్..
మిషన్ కాకతీయ కింద నల్ల చెరువు పూడిక తీయడంతో నీటి సామర్థ్యం పెరిగింది. రెండు పంటలకు సరిపోవడంతోపాటు మరో పంటకు కూడా సరిపడేలా నీటి నిల్వ ఉన్నది. కేసీఆర్ సారు తీసుకున్న నిర్ణయంతో నేడు ఆయకట్టు కింద రెండు పంటలు పండుతున్నాయి. దిగుబడి కూడా బాగానే ఉంది. నీటి సమస్య లేదు..
– కప్ప గంగారాం, ఆయకట్టు రైతు, కోటగిరి