రైతు సంక్షేమం కోసం కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పెట్టుబడి సాయం పథకానికి గ్రహణం పట్టుకున్నది. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుబంధు రూపంలో అమలయ్యే ఈ స్కీమ్ నిలుపుదలైంది. తొలుత సర్కారు వచ్చిన కొత్తలో యాసంగి సీజన్‌కు కేవలం ఐదు ఎకరాల్లోపు రైతులకు పెట్టుబడి సాయాన్ని అరకొరగా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూపంలో అందాల్సిన మొత్తాన్ని మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు అందించలేకపోయింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అమలైనట్లే ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున యాసంగిలో ఎకరానికి రూ.5వేలు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. ప్రస్తుతం వానాకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా పెట్టుబడి సాయం మాత్రం ఊసేలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే ఈ భేటీలు చివరి అంకానికి చేరుకోగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఇప్పటికీ రాలేదు. జూలై 18న జరగాల్సిన భట్టి మీటింగ్ వాయిదా పడగా రైతులతో ముఖాముఖికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం కరువైంది.
రైతుబంధుతో రైతులు రుణ విముక్తి పొందారు. కేసీఆర్ మూలంగా అమలైన ఈ పథకంతో పంటకాలం ప్రారంభంలోనే రైతులకు ఎంతో మేలు చేసేది. చేదోడు వాదోడుగా రైతుబంధు ఉపయుక్తమై నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఊసే కరువైంది. ఏమిటని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వంపై ఆశలు చంపుకున్న రైతన్నలంతా చేసేది లేక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మరీ పెట్టుబడికి డబ్బులను సర్దుకుంటున్నారు.
వాయిదా రూపంలో కొందరు, భూములు తనఖా పెట్టి మరికొందరు… ఇలా చాలా మంది ఇతరులపై ఆధారపడి పంట కాలానికి నగదును సమకూర్చుకున్నారు. ప్రభుత్వం మాత్రం చీమకుట్టినైట్లెనా స్పందించకుండా నిబంధనల అమలు పేరుతో రైతుభరోసాను అమలు చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఓటేసిన రైతులంతా ఎకరానికి రూ.15వేల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వారి ఆశలపై కాంగ్రెస్ సర్కారు నీళ్లు చల్లుతున్నది. కేసీఆర్ పాలనలో ఠంఛనుగా పెట్టుబడి సాయం అందిందంటూ మునుపటి రోజులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
పెట్టుబడి సాయం ఎగవేత కోసమే ప్రభుత్వ వ్యూహం కింద కనిపిస్తున్నట్లుగా రైతులు భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు అమలు చేయాల్సిన రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15వేలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పాలనాపగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావొస్తున్నప్పటికీ యాసంగి, వానాకాలం సీజన్లు వచ్చినప్పటికీ ఊసెత్తడం లేదు. రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాలు తిరుగుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తాత్సారం చేయకుండా వేగంగా మీటింగ్‌లు ఎందుకు పూర్తి చేయడం లేదో? ఎవరికి అర్థం కావడం లేదు. పైగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించాల్సిన సమావేశాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు.
రుణమాఫీ తొలి విడుత పథకం ప్రారంభోత్సవం ఉండడంతోనే నిజామాబాద్‌లో జరగాల్సిన రైతులతో భేటీ రద్దు చేసినట్లుగా ప్రకటించారు. రుణమాఫీ తర్వాత రెండో విడుత కూడా అమలైంది. పంద్రాగస్టుకు మూడో విడుత అమలుకు నోచుకోబోతోంది. కానీ రైతుభరోసా పేరిట నిజామాబాద్‌లో జరగాల్సిన మీటింగ్ మాత్రం నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల అభిప్రాయాలను తెలుసుకునే ఎత్తుగడతో ఈ సీజన్‌ను దాటవేసి చేతులు దులుపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా ప్రభు త్వం ఇవ్వాల్సిన రైతుభరోసాకు విధివిధానాలను ఎంతకూ ఖరారు చేయకపోవడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
రైతుబంధుపై కాలయాపన చేస్తున్నట్లు అనిపిస్తుం ది. ఎందుకంటే పంటలు వేసే సమయానికి రైతుబం ధు వస్తే రైతు ఎంతో సంతోషంగా ఉంటాడో మాటల్లో చెప్పలేం. పో యిన సంవత్సరం వరకు ఫోన్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని చూసేటోళ్లం. ఇప్పుడు రైతుబంధు వస్తుందా లేదా అన్న అనుమానం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అప్పు చేయాల్సిన పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి.
– బాలమల్లేశ్, రైతు, వడ్యాట్
మోర్తాడ్, ఆగస్టు 11: గతంలో పంటలు వేస్తున్నామంటే వడ్డీ వ్యాపారుల దగ్గరకు చేయి చాపాల్సి వచ్చేది. అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కేసీఆర్ ఉన్నపుడు నాట్లు వేసే సమయానికి రైతుబంధు వచ్చేది. కూలీల ఖర్చులకు, ఎరువుల ఖర్చులకు ఎవ్వరినీ అడగాల్సిన అవసరం ఉండేదికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నది. వానాకాలం పంట మొదలై నెల దాటిపోయింది. అయినా రైతుబంధు రాలేదు. చేసేదేమి లేక మళ్లీ వడ్డీవ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తున్నది. ఇప్పటికైనా రైతుబంధు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.
– తాటిపల్లి శ్రీనివాస్, రైతు, దొన్కల్