వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనవసరమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో సోమవారం రైతు సమావేశాలు నిర్వహించారు. రైతువేదికల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు.. కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి కరెంటు ఇచ్చిన విధానాన్ని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతాంగానికి చేస్తున్న కరెంటు సరఫరా వివరాలను ప్రజాప్రతినిధులు కూలంకషంగా వివరించారు. వేల్పూర్ రైతువేదికలో నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మోపాల్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
– నిజామాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనల పర్వం కొనసాగుతున్నది. వ్యవసాయానికి 3గంటల విద్యుత్ సరిపోతుందంటూ మాట్లాడిన పీసీసీ చీఫ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ సోమవారం రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. రైతువేదికలకు భారీగా తరలివచ్చిన కర్షకులతో కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు శరాఘాతంగా దాపురించాయని అన్నదాతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు వారం రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుండగా తాజాగా రైతువేదికల వద్ద చర్చా కార్యక్రమం వినూత్నంగా సాగింది. వేల్పూర్‌లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా సమావేశమై కాంగ్రెస్ పార్టీ తీరుపై విశ్లేషించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులకు ఎదురైన దయనీయమైన పరిస్థితులను గుర్తుచేస్తూ కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేశారు.
Tpcc Chief Revanth Reddy
కాంగ్రెస్ తీరు బట్టబయలు…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలతో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్ఎస్ నేతలు బట్టబయలు చేశారు. నియోజకవర్గాల్లో రైతువేదికలు, ఆయా క్లస్టర్ల వద్ద సుమారుగా వేయి మంది రైతులతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. రైతుల అనుభవాలను బీఆర్ఎస్ నేతలు చెప్పించగా ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. తమ బతుకుల్లో వెలుగులు నింపింది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రైతులు కుండబద్ధలు కొట్టారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రైతులకు ఇసుమంతైన కష్టం రాకుండా చూస్తున్న వ్యక్తి కేసీఆర్ అంటూ కితాబునిచ్చారు. అన్నదాతలకు అండ దొరికిన ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కుట్రలకు పాల్పడుతూ రైతు సంక్షేమాన్ని దిగ్విజయంగా అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీపై విషప్రచారం చేస్తున్నదని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.
వేల్పూర్‌లో మంత్రి, మోపాల్‌లో బాజిరెడ్డి…
వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన రైతులంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ట రాజకీయంపై ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కేసీఆర్ వచ్చాకే తమ బతుకులు మారాయన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో రైతుసభ నిర్వహించారు. రైతులంతా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన ద్వారా రైతులంతా అయోమయానికి గురైనట్లుగా పలువురు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల బాగోగులు తెలియవని, రాష్ట్రంలో కర్షకుల కన్నీళ్లు తుడిచేది కేవలం కేసీఆర్ మాత్రమేనంటూ కుండబద్ధలు కొట్టారు.
పది రోజులపాటు రైతుసభలు..
తొలిరోజు రైతుసభలకు మంచి స్పందన వచ్చింది. కొండంత అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీలో రైతులంతా కుటుంబ సభ్యులే అన్న చందంగా సమావేశాలు జరిగాయి. స్వచ్ఛందంగా రైతువేదికల వద్దకు వచ్చిన వారంతా మూకుమ్మడిగా కేసీఆర్ సర్కారుకు మద్దతు తెలిపారు. జై కిసాన్ జై కేసీఆర్ నినాదాలతో రైతువేదికలు దద్దరిల్లాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులంతా నినదించారు. వ్యవసాయం దండగన్న టీడీపీ పార్టీ ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డికి వ్యవసాయ రంగంపై ఉన్న అవగాహన శూన్యమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైతులను అధోగతి పట్టించేందుకు హస్తం పార్టీ చేస్తున్న అరాచక ప్రచారాలను తిప్పి కొట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదాన్ని కర్షకులు గుర్తించారు. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు తీసుకోవాలంటేనే ప్రహసనంగా ఉండేది. వ్యవసాయ కనెక్షన్ల నుంచి ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ల వరకు అంతా సులువుగా జరుగుతున్నది. కోతల్లేని కరెంట్‌తో రాత్రీపగలు తేడా లేకుండా సాగుకు నీళ్లను పారించుకునే వసతి ఇప్పుడు ఉన్నదని రైతులు చెప్పుకొచ్చారు. వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు సభల్లో చర్చించిన అంశాలను గ్రామాల్లో సామా న్య ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని తీర్మానించారు. 3గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పలువురు సూచించారు.
కాంగ్రెస్ నాశనం అవుతుంది..
రైతుల జోలికి వస్తే సర్వ నాశనం అవుతారు. మమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవుసానికి 24 గంటల కరెంటు ఇచ్చుట్ల కష్టాలు పడ్తలేము. మళ్లీ రైతులకు కష్టాలు తేవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది.
– పాలెపు నర్సయ్య, మోతె
కాంగ్రెసోళ్లకు కండ్లుమండుతున్నయ్..
కాంగ్రెస్ హయాంలో ఏడు గంటల కరెంటు ఉన్నప్పుడు మోటర్లు ఆగిపోతుండె. మోటర్లు మళ్లీ నడవాలంటే తోటలకు వెళ్లి మళ్లీ మోటర్లలో నీళ్లు పోసి నడిపించేటోళ్లం. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలువకపోయేది. సీఎం కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇవ్వడంతో చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నం. దీంతో కాంగ్రెసోళ్లకు కండ్లు మండుతున్నట్లున్నది.
– గంగయ్య, అంక్సాపూర్
రేవంత్‌కు నీళ్లు పారిచ్చుడు తెలుసా?
కాంగ్రెస్ హయాంలో ఏడు గంటల కరెంటుతో నలుగురు కలిసి వంతుల ప్రకారం నీళ్లు పారిచ్చుకునేవాళ్లం. రేవంత్‌రెడ్డికి గనుమలు మలుపుడు తెలుస్తదా? అతనికి మతిభ్రమించింది. కాంగ్రెస్ నాయకుల్లారా.. రేవంత్‌రెడ్డిని దవాఖానలో చూపించండి.
– బోదపల్లి సురేశ్‌కుమార్, కుకునూర్
బీఆర్ఎస్ హయాంలోనే కష్టాలు తీరాయి..
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి సరిపడా కరెంటు లేక, నాణ్యమైన కరెంటు రాక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. వాటి రిపేర్ల కోసం బకాయిలు చేసేవాళ్లం. కరెంటు లేక భూములు అమ్ముకున్నాం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తీరాయి. మళ్లీ కష్టాలు తెచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.
– రాజారెడ్డి, పోచంపల్లి
కేసీఆర్‌తోనే సాగునీటికి ఢోకాలేదు
కేసీఆర్ సీఎం అయిన తర్వాతే సాగునీటి వసతులు పెరిగాయి. కరెంటు మం చిగ ఉంటున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయరంగంలో మార్పులు వచ్చాయి. గతంలో రైతుకు, వ్యవసాయ భూములకూ విలువ ఉండేది కాదు. కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతులకు, భూములకు విలువ పెరిగింది.
– ఏలేటి చిన్నారెడ్డి, వేల్పూర్
నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..
రేవంత్‌రెడ్డి.. రైతులకు నష్టం కలిగించేందుకే బూటకపు మాటలు మాట్లాడుతుండు. రైతుల కష్టాలు ఆయనకు ఏం తెలుసు. ఆయనకు ఎవుసం మీద ఏమైనా అవగాహన ఉన్నదా. కరెంటు గురించి ఏమైనా తెలుసా… నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.
– జాగర్ల నర్సయ్య, రామన్నపేట్
రేవంత్.. తప్పు మాట్లాడినవ్…
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు వద్దనడం వందశాతం తప్పు. రేవంత్‌రెడ్డి.. తప్పు మాట్లాడినవ్. వెంటనే నీ మాటల్ని వెనక్కి తీసుకొని, క్షమాపణ అడుగు. రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరైంది కాదు.
-అక్లూర్ నర్సారెడ్డి
గంటలో ఎకరం పారించి చూపెట్టు..
రేవంత్‌రెడ్డి.. ఒక గంటలో ఎకరం పారిస్తామని చెబుతున్నవు కదా. నువ్వే ఒకరిని పంపిస్తే జీతానికి పెట్టుకుంటాం. గంటలో ఎకరం పారించి చూపెట్టు. మూడు గంటల కరెంటుతో వ్యవసాయం చేసుడు ఎట్ల సాధ్యమవుతుంది. రేవంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి చూపిస్తే బాగుంటుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. రైతులంతా కలిసి బుద్ధి చెబుతాం.
– నీరటి రాజేశ్వర్, వెంకటాపూర్