భారీ వర్షాలు ఇందూరు జిల్లాను వణికించాయి. ఒక్క రాత్రిలోనే అంతా అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి రికార్డు స్థాయిలో వేల్పూర్‌లో ఏకంగా 46 సెం.మీటర్ల వర్షం కురవగా, పెర్కిట్‌లో 33, భీమ్‌గల్‌లో 24, జక్రాన్‌పల్లి, కోనసముందర్‌లో 22 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వరద పోటెత్తడంతో చెరువు కట్టలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో నిజామాబాద్-కరీంనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. వేల్పూర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మదర్సాలో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. మంగళవారం ఉదయమే వేల్పూర్ చేరుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రోజంతా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు.
– నిజామాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూలై 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేల్పూర్‌లో అతి భారీ వర్షం బీభత్సం సృ ష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన వానకు తెల్లారి చూసే సరికి చెరువు కట్టలు తెగి, రోడ్లు కొట్టుకుపోయిన భయానక పరిస్థితి ఎదురైంది. రోడ్లపై అంతా వరద ఏరులై పారింది. కుండపోతను మించి కురిసిన వానలతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది.
తెగిన చెరువు కట్టలు
అతి భారీ వర్షానిక వేల్పూర్ మండలంలో ఐదు చెరువు కట్టలు తెగిపోయాయి. మరుస కుంట చెరు వు, కాటి చెరువు, పడగల్ గ్రామంలోని నవాబు చెరువు, పచ్చల నడ్కుడ చెరువు, జాన్కంపేట చెరువు కట్టలు తెగిపోయి వరద రోడ్లపైకి పారింది. మరుసకుంట చెరువు కట్ట తెగిపోవడంతో వేల్పూర్-ఆర్మూర్ రహదారి మీదుగా వరద ఉధృతంగా ప్రవహించింది. సమీపంలోని వేల్పూర్ పోలీస్‌స్టేషన్,తహసీల్ కార్యాలయంతో పాటు పలు నివాస ప్రాంతాలు, పంట పొలాలు జలమయమయ్యా యి. ఆర్మూర్ నుంచి వేల్పూర్ వైపునకు వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. సమీపంలోని మదర్సాను చెరువు నీరు చుట్టేసింది. దీంతో ఈ పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించా రు. వేల్పూర్ మండలంలోని లక్కోరా చెరువు కట్ట నుంచి నీరు పొంగి 63వ నంబరు జాతీయ రహదారి మీదుగా ప్రవహించింది. దీంతో ఆర్మూర్ నుంచి కరీంనగర్ వైపు వాహనాల రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. రామన్నపేట్-వేల్పూర్ మధ్య బీటీ రోడ్డుపై నుంచి మోతె చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్‌లో తెగిన చెరువుల నుంచి భారీ వరద దిగువన ఉన్న వెంకటాపూర్ చెరువులోకి చేరి అలుగు గుండా కుకునూర్, వెంకటాపూర్ బీటీ రోడ్డు మీదుగా ప్రవహించి పెద్దవాగులోకి కలుస్తున్నది. పూర్తి స్థాయిలో నిండిన వెంకటాపూర్ చెరువు కాస్త ఆందోళనకరంగా కనిపించింది. కుకునూర్, వెంకటాపూర్ మధ్య వరదతో బీటీరోడ్డు ధ్వంసమై రాకపోకలు ఆగిపోయాయి. వేల్పూర్‌కు భీమ్‌గల్ వైపునుంచి..పచ్చలనడ్కుడ నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి.
మరో రెండు రోజులు హైఅలర్ట్…
రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే కుండపోతను మించి కురుస్తోన్న వానలతో ఉభయ జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా రానున్న 48 గంటల్లోనూ భారీ వర్ష సూచనతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యే వరి నాట్లు వేసుకున్న రైతులంతా పొలం నిండా నీళ్లు నిలిచి పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందలాది చెరువులు అలుగులు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1086చెరువులకు గాను 263 చెరువులు మత్తడి పోస్తుండగా 543 చెరువుల్లో గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకున్నది. 217 చెరువుల్లో 50-75శాతం, 55 చెరువుల్లో 25-50శాతం, 8 చెరువుల్లో 25శాతంలోపు నీళ్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1425 చెరువులకు 321 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 388 చెరువుల్లో అలుగులు పోసేంత స్థాయికి చేరుకున్నాయి. 424 చెరువుల్లో 50-75శాతం మేర నీళ్లు చేరాయి. 259 చెరువుల్లో 25-50శాతం, 33 తటాకాల్లో 25శాతంలోపు నీళ్లున్నట్లుగా నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 584 చెరువులు అలుగులు పారుతున్నాయి.
ఎస్సారెస్పీ రెట్టింపు వరద…
గోదావరి పరీవాహక ప్రాంతంలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. భారీ వానలతో మొన్నటి వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో కేవలం 9వేల క్యూసెక్కులకే పరిమితమైంది. ఆ తర్వాత 20వేల క్యూసెక్కులకు వరద చేరుకున్నది. ఎస్సారెస్పీ దిగువ గోదావరిలో భయానక వరద కనిపిస్తున్నది.వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో కురిసిన అతి భారీ వానలతో చెరువులు, చెక్ డ్యాంలు నిండుకుండలా మారి పెద్ద ఎత్తున వరద గోదావరి నదిలో కలుస్తున్నది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1091 అడుగుల నీటి మట్టానికి 1083.90 అడుగులకు చేరింది. 90.3టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 63.469 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఎస్సారెస్పీకి మొత్తం 45.979 టీఎంసీలు వరద వచ్చింది. ఇదే కాలానికి ఔట్ ఫ్లో 3.573 టీఎంసీలుగా నమోదైంది.
మోర్తాడ్‌లోనూ..
మోర్తాడ్, జూలై 25 : మోర్తాడ్‌లో సోమవారం రాత్రి నుంచి వాన దంచికొట్టింది. పెద్దవాగు, ధర్మోరా, మోర్తాడ్ మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మోరా వద్ద వాగు నీళ్లు రోడ్డుపై నుంచి పారడంతో వన్నెల్-బీ నుంచి పాలెంకు వెళ్తున్న కారు నీటి ఉధృతిలో చిక్కుకున్నది. కారులో ప్రయాణిస్తున్న నర్సయ్య, అశోక్‌ను మోర్తాడ్ పోలీసులు, ధర్మోరా గ్రామస్తులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. పాలెం-ధర్మోరా మధ్యలో చెక్‌డ్యాం కనిపించకుండా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బావయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
వేల్పూర్‌లో రికార్డు స్థాయిలో 46 సెం.మీ వర్షపాతం
బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూర్ మండలంలో సోమవారం రాత్రి అతిభారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెం.మీ వర్షపాతం నమోదైంది. అతిభారీ వర్షాలతో రాష్ట్రంలో 8 ప్రాంతాలను రెడ్‌జోన్ ప్రకటించారు. ఎనిమిదింటిలో ఐదు నిజామాబాద్ జిల్లాలోనివి కాగా ఈ ఐదింటిలో మూ డు బాల్కొండ నియోజక వర్గంలోనే ఉన్నాయి. పెర్కిట్‌లో 331మి.మీటర్లు, భీమ్‌గల్‌లో 264.5 మి.మీటర్లు,కోనాసముందర్ 226.5మి.మీటర్లు, జక్రాన్‌పల్లి 222 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఐదు గ్రామాలను వాతావరణ శాఖ రెడ్ జోన్ కింద పరిగణించింది. డిచ్పల్లి మండలం కోరట్పల్లిలో 172.3 మి.మీటర్లు, మోర్తాడ్‌లో 112.8, ధర్పల్లిలో 97.8, ఆలూర్‌లో 87.5, గూపన్పల్లిలో 82.8, కమ్మర్‌పల్లిలో 75.5, డిచ్‌పల్లిలో 73.5, బాల్కొండలో 72.5, మగ్గిడిలో 70.3, తొండాకూర్‌లో 68.5, సిరికొండలో 65, బెల్లాల్లో 64.8 మి.మీటర్లు చొప్పున నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠంగా చీమన్‌పల్లిలో 7మి.మీటర్లు, మోస్రాలో 3.8 మి.మీటర్లు మాత్రమే కురిసింది. వేల్పూర్‌లో నమోదైన వర్షాపాతం ఇప్పటి వరకు ఉభయ జిల్లాల్లో ఎక్కడా నమోదు కాలేదని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోనూ ఇంతటి భారీ వర్షపాతం నమోదు కావడం అరుదుగా భావిస్తున్నారు. భారీ వానలతో రెండు రోజులుగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో సగటున 46.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాన్సువాడ మండలంలో 80.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
వేల్పూర్‌లో మంత్రి వేముల పర్యటన
అతి భారీ వర్షం కురుస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హుటాహుటిన తన నియోజకవర్గానికి మంగళవారం ఉదయం చేరుకున్నారు. స్వగ్రామం వేల్పూర్‌లో వరదతో తెగిన చెరువు కట్టలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి పరిశీలించారు. రైతుల్లో, స్థానిక ప్రజల్లో ధైర్యం నింపారు. వేల్పూర్‌లో ఇంతటి వానను తానెప్పుడూ చూడలేదంటూ మంత్రి వేముల స్థానికులతో వ్యాఖ్యానించారు. వరద ధాటికి కొట్టుకుపోయిన తారు రోడ్లను ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో కలిసి పరిశీలించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే నష్ట అంచనాలను సిద్ధం చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వానలతో ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలంటూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందస్తుగానే ముంపు ప్రాంతాలను గుర్తించి ఇబ్బందులు ఎదుర్కొనే కాలనీల్లో ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగంతో మంత్రి సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు. ఇసుక మేటలు వేసిన పంటలను పరిశీలించి, అధైర్యపడవద్దని…అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి భోజనవసతి కల్పించాలని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లడుతూ..భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేలా అధికారులను సన్నద్ధం చేశామన్నారు. ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు,సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.మంత్రి వెంట ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్, ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్, డీపీవో జయసుధ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
నేనున్నా… ఆందోళనవద్దు…
మొన్నటి వరకు వర్షాలు లేక బాధపడ్డాం. కాళేశ్వరం జలాలను పైకి తీసుకు వచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేశాం. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ను నింపే ప్రయత్నం చేశాం. ప్యాకేజీ 21 ద్వారా కప్పలవాగు ద్వారా గోదావరి నీళ్లను తరలించాం. అంతలోనే వర్షాలు మొదలైనాయి. ఆలస్యంగా వచ్చిన వానలు ఉగ్రరూపంలో భయానకంగా కురుస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి నుంచి వానలు పడుతున్నాయి. నిన్న రాత్రి మరీ ఎక్కువ పడింది. ప్రజలెవ్వరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి చెరువు కట్టపై ఇరిగేషన్, రెవెన్యూ వ్యవస్థను కేంద్రీకరించాం. వరద తగ్గుముఖం పడితే వెంటనే తెగిన చెరువు కట్టలకు మరమ్మతులు చేస్తాం. రైతులకు మొన్నటి వరకు వర్షాలు లేవనే బాధ. ఇప్పుడేమో వర్షాలు అధికమై పంటలు నష్టం. ప్రకృతిని ఆపడం ఎవరి తరం కాదు. మానవ శక్తికి అతీతమైన వర్షం ఇదీ. కరీంనగర్ వెళ్లే దారిలో లక్కోర చెరువు కట్టమీది నుంచి వరద ఓవర్ ఫ్లో కావడంతో రాకపోకలు నిలిచాయి. రోడ్లు దెబ్బతిన్నవి బాగు చేసుకుంటాం.
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి