నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఒక యజ్ఞంలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చంద్రమోహన్తోపాటు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ప్రభు త్వ యంత్రాంగానికి మంత్రి పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ పరంగా అండగా నిలవాల్సిన సమయంలో బాధ్యతతో ప్రభుత్వాధికారులు మెదలాలని సూచించారు. రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిన దశలో అకా ల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటి కే రైతుపక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతను ఆదుకునేందుకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని స్పష్టమై న ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పు న పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రైతులకు ఆపన్నహస్తం అందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు అంకితభావంతో కృషి చేయాలన్నారు.
తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తలించాలని మంత్రి సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో 31,567 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 63వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదికలు అందాయన్నారు. పంట నష్టం అంచనాల రూపకల్పన విషయంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, రైతు కోణంలో ఆలోచన చేయాలని మంత్రి సూచించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తుందని, అన్నదాతలు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. గత మార్చిలో నిజామాబాద్ జిల్లాలో 467 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10వేల చొప్పున రూ.46 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ మొత్తాన్ని త్వరలోనే రైతు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ధాన్యం సేకరణలో రైతులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా తక్షణమే ధాన్యం అన్లోడింగ్ జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల్లో ఐదు శాతానికి మించి ధాన్యం నిల్వలు మిగిలి ఉండకూడదని, సేకరించిన ధాన్యంలో 95శాతం మేర నిల్వలు రవాణా, అన్లోడింగ్ జరిగిపోవాలని స్పష్టం చేశారు. ధాన్యం అన్లోడింగ్ విషయంలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే, కడ్తా పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మిల్లులను సీజ్ చేసేందుకు వెనుకాడబోమన్నారు. ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.