నిజామాబాద్, నవంబర్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దరిమిలా రామారెడ్డిలో రైతుల అడ్డగంతపై సీతక్క తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా పరిపాలనలో రైతులకు మేము ఏం అన్యాయం చేశామని… బీఆర్ఎస్ వాళ్లు రైతుల ముసుగులో రైతు పోరాటం చేస్తున్నారంటూ నిరసన చేసిన వారిని ఉద్దేశించి మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిపై పోలీసు కేసులు పెట్టించారు. వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు ఏవీ సరిగా అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23 నెలల కాలంలో కర్షకులు తీవ్ర స్థాయిలో మోసానికి గురయ్యామన్న భావనలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో పాటుగా అరకొరగా అందుతోన్న ప్రభుత్వ సాయంతో రైతులకు నిజంగానే అన్యాయం జరుగుతుందనే భావన ఏర్పడింది. 2023, డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటోన్న కాంగ్రెస్ సర్కారు కొలువు దీరింది. నాటి నుంచి నాలుగు పంట కాలాలు పూర్తయ్యాయి. ఇందులో రైతు భరోసా అమలు అన్నది తూతూ మంత్రంగానే జరిగింది. రెండు సీజన్లకు పూర్తి స్థాయిలో పథకం అమలు కాలేదు. ఈ వానాకాలంలో రూ.15వేలకు బదులు రూ.12వేలు అందించారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదు. సీతక్క పర్యటించిన భిక్కనూర్, రామారెడ్డి మండలాల్లో వానాకాలం సీజన్లో రైతులంతా రోడ్డెక్కి యూరియా కోసం ఆందోళన చేశారు. షబ్బీర్ సొంత మండలం మాచారెడ్డిలోనూ యూరియా కోసం అన్నదాతలంతా అష్టకష్టాలు పడ్డారు. ఇదంతా కళ్ల ముందే జరిగింది. మంత్రి సీతక్క మాత్రం తమ పాలనలో ఏం అన్యాయం జరిగింది? అంటూ ఎదురు ప్రశ్నించడంపై రైతులు మండిపడుతున్నారు.
పంట ఉత్పత్తులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వరి పంటకు అందులోనూ సన్నరకాలకే వర్తిస్తుందంటూ సర్కారు సెలవిచ్చింది. బోనస్ వర్తింపజేస్తామని చెప్పిన సన్న రకం వడ్లకు కూడా యాసంగిలో పైసా విడుదల చేయలేదు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదున్నర లక్షల మందికి రూ.449 కోట్లు పెండింగ్‌లోనే ఉంది. ఈ వానాకాలంలో కొద్ది మందికి బోనస్ వేశారు. క్వింటాకు రూ.500 చొప్పున అందించినప్పటికీ వేగంగా సాగడం లేదు. 2024లో యాసంగి, వానాకాలం సీజన్లోనూ అరకొరగానే బోనస్ అమలైంది.
ఇదీ మోసం కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగి, వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదు. 2025 వానాకాలం మొదట్లో జీలుగ విత్తనాల ధరలను అమాంతం మూడు రెట్లు పెంచారు. సరిపడా జీలుగ విత్తనాలు లేక వరుసల్లో రైతులు నిలబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల సాగు కాలంలో పడుతోన్న పాట్లు పదేళ్ల క్రితం నాటి సమైక్య పాలనను మరోసారి గుర్తుకు చేసింది. కేసీఆర్ హయాంలో రైతుకు చీకు చింత కనిపించలేదు. దర్జాగా సాగు బాటలో విజయం సాధించారు. కానిప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటంతోనే రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుతోంది. సమాధానం చెప్పాల్సిన మంత్రి సీతక్క అందుకు విరుద్ధంగా మాట్లాడటంపై రైతులు అవాక్కు తింటున్నారు.
వానాకాలంలో అకాల వానలకు ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వచ్చిన ఇన్ఛార్జీ మంత్రి రైతులను పరామర్శించారు. రైతులను ఆదుకుంటామని సెప్టెంబర్ 4న చెప్పినప్పటికీ రెండున్నర నెలలవుతోన్న వారికి సాయం అందలేదు. ఇదీ అన్యాయం కాక మరేమిటి? అని వరద బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. మక్కజొన్న, సోయా, పత్తి రైతుల పరిస్థితి ఈసారి అధోగతిపాలైంది. సోయా రైతులైతే మద్దతు ధర లేక విలవిల్లాడుతున్నారు. పత్తి రైతులకు రూ.8110 మద్దతు ధర మచ్చుకైనా అమలు కావడం లేదు. రైతులకు తేమ శాతం పేరుతో సీసీఐ వేధిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కామారెడ్డిలో 7 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు తెరిచినప్పటికీ పత్తి రైతులకు ఎమ్మెస్పీ అందడం గగనమైంది. సోయా రైతులకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటుకు అమ్ముకున్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా ఆలస్యంగా కేంద్రాలు తెరవడంతో న్యాయం జరగలేదు. ఇక ధాన్యం కొనుగోళ్లలోనూ ఇదే దుస్థితి రైతులను వెంటాడుతోంది. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ బస్తాకు 1కిలో నుంచి కిలోన్నర వరకు ధాన్యాన్ని తరుగు పేరిట కోత పెడుతున్నారు. రైతులు ఆందోళనలు చేసిన ఘటనలు అనేకం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వెలుగు చూశాయి. పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో దోపిడీ, రైస్ మిల్లర్ల మోసానికి రైతులు బలి అవుతుండటం అన్యాయం కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగి సీజన్‌కు సాగు అంచనాలు సిద్ధం అయ్యాయి. నెల రోజుల్లో యాసంగి మొదలు కానుంది. రైతుభరోసా వస్తుందో? రాదో? అన్న అయోమయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఠంచనుగా పెట్టుబడి సాయం వచ్చేది. కానిప్పుడు అయోమయం నెలకొన్నది.