బాన్సువాడ, ఫిబ్రవరి 4 : వర్ని మండలం సిద్ధాపూర్‌కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు కుటుంబం, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. బాన్సువాడ నియోజక వర్గంలోని నిజాంసాగర్ నాన్ కమాండింగ్ ఏరియా ప్రాంతంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని 11 గ్రామాల రైతులు, నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులతో పాటు నాన్కమాండింగ్ ఏరియా ప్రాంత రైతులకూ సాగునీరు అందించాన్నదే తన లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, వేంకటేశ్వర స్వామి దయతో కల నిజం కానున్నదని అన్నారు.
సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.72.50 కోట్లు, రెండు కాలువల నిర్మాణ పనులకు రూ.46.89 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరుచేసిందని తెలిపారు. టెండర్లు కూడా పూర్తయినట్లు చెప్పారు. సిద్ధ్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో వర్ని, బాన్సువాడ మండల్లాల్లోని 11 గ్రామాల్లోని 20 వేల ఎకరాల మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందుతుందని వివరించారు. సమావేశంలో ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ , డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్ పాల్గొన్నారు.
వర్ని, ఫిబ్రవరి 4: వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 11వ తేదీన రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, పార్కింగ్, బహిరంగ సభా స్థలాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. సురేందర్ రెడ్డి వెంట వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, రైతు బంధుసమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, జాకోరా విండో చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేక వీర్రాజు, సీహెచ్ గంగాధర్, పార్టీ వర్ని మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.