కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న కేసీఆర్తో ఈ ప్రాంతానికి నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయితే అభివృద్ధికి కొదువ లేదంటూ ప్రజలకు వివరించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. వాడూవీడు వచ్చి చెప్పే అబద్ధాలను పట్టించుకోవద్దన్నారు. దరిద్రానికి నేస్తం హస్తం పార్టీ అంటూ కేటీఆర్ అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు 50ఏండ్లపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ఏమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉన్న తెలంగాణను ఊడ్చేసి ఆంధ్రాలో కలిపి మనల్ని మోసం చేసిందే కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు వారి మదిలో ఎందుకు రాలేదో ఆలోచించాలన్నారు. పేదల బాగు కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతుబిడ్డగా, కర్షకుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ అనేక స్కీములను తీసుకువచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, బీబీపేట మండలాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యుడు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శనివారం రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ పట్వారీ వ్యవస్థ తెస్తామని చెబుతుండడాన్ని ప్రజలంతా గుర్తించాలని కేటీఆర్ అన్నారు. పట్వారీ వ్యవస్థ వస్తే మన బతుకులు ఆగమవుతాయన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా 10 హెచ్పీ మోటార్లతో నీళ్లను తోడుకోవచ్చంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పొలాల్లో 10హెచ్పీ మోటార్లు బిగిస్తే భూగర్భ జలం మిగులుతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను కాపాడుకుంటేనే ప్రజలందరూ సౌభాగ్యంగా ఉంటారన్నారు. రుణమాఫీ అందని రైతులు ఫికర్ పడాల్సిన పనిలేదన్నారు. వారికి కొత్త ప్రభుత్వంలో నిధులు విడుదల చేసి ఆదుకుంటామన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ వారేనని చెప్పారు. రైతుబీమా మాదిరిగానే తెల్లరేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా పథకం అందిస్తున్నామన్నారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా చేయబోతున్నట్లుగా చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరలను మోదీ పెంచితే కేసీఆర్ తగ్గించి రూ.400కే అందించేందుకు సిద్ధమయ్యారన్నారు. అసైన్డ్ భూములున్న వారికి హక్కు పత్రాలు కల్పిస్తామని, దీంతో దళిత, గిరిజన, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కామారెడ్డికి ఏడాదిన్నర కాలంలోనే గోదావరి జలాలను అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చి తీరుతామన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలతోనే ఈంచు జాగా ఖాళీ లేకుండా పంటలు పండుతున్నాయన్నారు. దాని ఫలితంగానే రోడ్లపై పుట్లకు పుట్లు వడ్లు కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్ వచ్చినంకనే వ్యవసాయం బాగుపడ్డదని, 24గంటల కరెంట్ వస్తుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. అనుమానపు పక్షులు కాంగ్రెసోళ్లు అని చెప్పారు. కరెంట్ వస్తుందో లేదా తెలుసుకోవాలంటే బీబీపేటలోని ఏ ఊరికైనా వెళ్లి కరెంట్ తీగలు పట్టుకుంటే సరిపోతుందని తెలిపారు. ఒకప్పుడు కాలిపోయే మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయిన చెరువులు, కూలిపోయిన తూములంటూ నాటి సమైక్య రాష్ట్రంలోని స్థితిగతులను కేటీఆర్ వివరించారు. 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులుంటే కేవలం తెలంగాణలోనే పింఛన్లు అందుతున్నాయన్నారు. బీడీలు చుట్టే మహిళలకు రూ.2వేలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. కటాఫ్ డేట్ను 2023 చేసి అందరికీ పింఛన్లు అందిస్తామని, అందర్నీ కాపాడుకుంటామన్నారు. కేసీఆర్ రాక ముందు రైతుబంధు ఉండేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పుర్రెలో ఇలాంటి ఆలోచనే లేదన్నారు. కేసీఆర్ కూడా రైతు కష్టం తెలిసిన బిడ్డే కాబట్టే ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నారన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన తర్వాత ఎకరానికి రూ.16వేలు ఇవ్వబోతున్నామన్నారు. ఆసరా పింఛన్లను రూ.5వేలు చేయబోతున్నామన్నారు. అత్తలకు పింఛన్లు వస్తున్నాయి.. మరి కోడళ్ల సంగతి ఏందనే వారికి డిసెంబర్ 3 తర్వాత సౌభాగ్యలక్ష్మి రూపంలో నెలకు రూ.3వేలు అందించనున్నట్లు కేటీఆర్ వివరించారు.