నిజామాబాద్, ఫిబ్రవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను సీఎం వేడుకున్నాడు. తమ వారికే ఓట్లు వేస్తేనే అభివృద్ధి చేస్తామంటూ పరోక్షంగా సున్నితంగా హెచ్చరించాడు. అయినప్పటికీ నిజామాబాద్ నగర జనం మాత్రం కాంగ్రెస్ పార్టీని అంతగా నమ్మినట్లుగా కనిపించలేదు. 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది.
స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 18 డివిజన్లలో విజయం వరించినప్పటికీ ఒంటరిగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అధికారిక కార్యక్రమం పేరుతో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేక పోవడంపై చర్చ నడుస్తోంది.
ఎంఐఎం పార్టీకి నిజామాబాద్‌లో 13 డివిజన్లలో విజయం దక్కింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే అనివార్యంగా ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. 31 కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో ఓట్లతో గట్టెక్కే పరిస్థితి కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ బీజేపీ రూపంలోనూ ప్రమాదం పొంచి ఉంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఇందూర్ నగర మేయర్‌గా ఎవరు ఎన్నిక అవుతారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి 28, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కింది.
నిజామాబాద్ నగరపాలక సంస్థలో మ్యాజిక్ ఫిగర్ 31 కాగా ఎవ్వరికీ పూర్తి స్థాయి మెజార్టీ దక్కలేదు. ఎక్స్ అఫిషియో ఓట్లపై బీజేపీ ఆధారపడింది. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠంపై కన్నేసినప్పటికీ ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా కీలకంగానే మారనుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఈ నెల 16న మేయర్, డిప్యూటి మేయర్లకు ఎన్నిక జరుగనుంది. మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు అదే రోజు ఎన్నిక ఉండనుంది.
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 13: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. 37వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరుపున గెలిచిన విజయలక్ష్మి సంతోష్ ఇంటికి వరుసకట్టారు. కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనాయకులు తరలివస్తున్నారు. ఈ రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి డిప్యూటీ మేయర్ పదవి ఆశచూపి మద్దతు కూడకట్టేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కెనాల్ కట్టవద్ద వీవీఐపీలు, పార్టీ ప్రతినిధులతో సందడి నెలకొన్నది.