Marijuana | వినాయక్ నగర్, అక్టోబర్ 6: నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించిన ముఠాను ఎక్సైజ్ టీంను అధికారులు సోమవారం పట్టుకున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన ముగ్గురిని ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టుబడిన వారి వద్ద నుండి 7 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పట్టుబడిన ముగ్గురిలో ఒకరు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మైనర్ బాలుడిగా ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. మిగతా ఇద్దరూ సిరికొండ ప్రాంతానికి చెందిన వోలం వంశీ, తొర్ర తరుణ్ వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసేందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓకు అప్పగించినట్లు అధికారుల పేర్కొన్నారు. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ ధరకు విక్రయించి డబ్బులు సంపాదించాలని నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
ఈ గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణరెడ్డి, రాజన్న,భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్ ,శ్యామ్, సాయి, ఉత్తం, రామ్ బచ్చన్, ఆశన్న, లక్ష్మణ్, గంగారం,మంజుల, సుకన్య కృషి చేశారని ఈ సందర్భంగా వారిని అధికారులు అభినందించారు.