సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలు చేస్తామన్న రేవంత్ సర్కారు ప్రకటనపై రైతుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో తీసుకురానున్న మార్పులపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు అందరికీ పెట్టుబడి సాయం ఇస్తారా? లేక కొర్రీలు పెట్టి కొందరికే ఇస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. రైతుబంధు పథకంలో మార్పులకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుటుంబం యూనిట్‌గా అమలు చేయాలని చూస్తున్నది. అలాగే, ఎన్ని ఎకరాలు ఉన్నా ఐదు లేదా ఏడు ఎకరాలకు మాత్రమే ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. పైగా రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ సర్కారు నాలుగు విడుతల్లో కలిపి కొంత మంది రైతులను మాత్రమే రుణ విముక్తులను చేసింది. సగం మందికి మొండిచేయి చూపింది. సాంకేతిక కారణాలను చూపి చాలా మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ అంటూ సగానికి ఎక్కువ మందిని పక్కకు జరిపింది. తాజాగా రైతుభరోసా పథకం అమలులోనూ ఇదే అస్తవ్యస్త విధానం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు. రెండు పంట సీజన్లలో కలిపి ఏడాదికి రూ.15 వేల చొప్పున సాయం అందాల్సి ఉండగా, ఇప్పటికీ చిల్లి గవ్వా అందలేదు. దీంతో రైతాంగం అప్పులు తెచ్చి నాట్లు వేస్తున్నది.
నిజామాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు డిక్లరేషన్ పేరిట అనేక వరాలు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అమలులో మాత్రం విఫలమైంది. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి కొంత మందికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది. రైతుబంధు పథకం అమలు చేయకుండా రైతులను దారుణంగా మోసగించింది. రైతుబంధు కింద ఇస్తున్న రూ.5 వేలను రూ.7,500కు పెంచి రైతుభరోసా పథకం తీసుకొస్తామన్న హామీ ఏడాది దాటినా అమలు కాలేదు. రెండు సీజన్లకు సంబంధించి పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన ప్రభుత్వం.. సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుభరోసా విధివిధానాల ఖరారుపై సర్కారు దృష్టి సారించడంతో రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. రైతుబంధు తరహాలో అందరికీ పెట్టుబడి సాయం ఇస్తారా? లేక కొందరికే ఇస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.
డిసెంబర్ 7, 2023న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2023 యాసంగిలో నామమాత్రంగా రైతుబంధు సాయాన్ని విడుదల చేసింది. మొన్నటి రబీ సీజన్లోనూ పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి మొదలై రెండు నెలలు గడిచినా రైతుభరోసాపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. రైతుబంధు డబ్బులు ఇవ్వకపోవడాన్ని ఎత్తిచూపింది. రైతుభరోసాపై అన్నదాతల్లో అలుముకున్న అనుమానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిసెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాంకేతిక అంశాలతో పాటుగా శాస్త్రీయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుభరోసాను అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కానీ, మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
కేసీఆర్ హయాంలో ఉమ్మడి జిల్లాలోని 5 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం ఠంచన్‌గా అందేది. రెండు సీజన్లలో కలిపి రూ.వెయ్యి కోట్ల దాకా రైతులకు లబ్ధి చేకూరేది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం ఆగిపోయింది. వానకాలంలో ఇవ్వకుండా ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు.. యాసంగికి సంబంధించి సంక్రాంతికి ఇస్తామని చెబుతున్నది. విధివిధానాల ఖరారులో నిమగ్నమైంది. పంట సాగు చేసిన భూములకు అది కూడా రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, ఏ పంటలు సాగు చేస్తే రైతుభరోసా వర్తిస్తుంది? ఉద్యాన పంటల సాగుకు ఇస్తారా? పామాయిల్ లాంటి దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తున్న రైతులకు రైతుభరోసా వస్తుందా రాదా? అన్నది స్పష్టత కరువైంది. అంకాపూర్ వంటి ప్రాంతాల్లో మూడు పంటలు సాగు చేసే రైతులున్నారు. పంటల ఆధారంగా పెట్టుబడి సాయం ఇస్తే వీరికి మూడు విడుతల్లో రైతుభరోసా వస్తుందా? అని రైతులు అడుగుతున్నారు. పసుపు పంట సాగు చేసే వారికి ఏడాది కాలం గడిచి పోతున్నది. 9 నెలల పసుపు పంటను సాగు చేసే వారికి ఏ ప్రాతిపాదికన రైతుభరోసా అందిస్తారో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు.