వినాయకనగర్, మే 4 : నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు రెండు రోజుల క్రితం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు డయల్ 100 నంబర్‌కు కాల్ వచ్చింది. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, విచారణ చేపట్టారు. నిందితుడిని కీసర ప్రాంతంలోని అంకిరెడ్డిపల్లి చెందిన శ్రీమంత్గౌడ్గా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
ఆదివారం నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. శ్రీమంత్గౌడ్ ఓలా డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని, భార్యా బాధితుడని పోలీసుల విచారణలో తేలింది. కొంతకాలం క్రితం సదరు నిందితుడిని భార్య ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో మద్యానికి అలవాటు పడిన నిందితుడు.. బాంబ్ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. వారు రిమాండ్ విధించారని ఎస్‌హెచ్‌వో తెలిపారు.