ఖలీల్‌వాడి/కోటగిరి, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నగరంలోని ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించిన మాల మహానాడు నేతలు సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 సర్వే ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ప్రతినిధులు ఎడ్ల నాగరాజు, అంగరి ప్రదీప్, అలుక కిషన్, జిల్లా మాలమహానాడు అధ్యక్ష, కార్యదర్శులు ఆనంపల్లి ఎల్లయ్య, నాంది వినయ్‌కుమార్, కోశాధికారి నీలగిరి రాజు, ఉదయ్‌కుమార్, సి.దేవదాస్, స్వామిదాస్, ప్రభాకర్, బొడ్డు నర్సింగ్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉమ్మడి కోటగిరి మండలాల మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు మం డల అధ్యక్షుడు మిర్జాపురం చిన్న సాయన్న మాట్లాడుతూ 2024 సర్వే ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడమేమిటని ప్రశ్నించారు. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల ప్రతినిధులు కాలే సాయి లు, జంగం సాయిలు, పాల గంగారాం, సుంకిని సాయిలు, మోరే జీవన్, నగేశ్, సతీశ్ పాల్గొన్నారు.