Maharana Pratap | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో శ్రీ సాయి ఆదర్శ యువతి మహిళా మండలి ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా మండలి అధ్యక్షురాలు పద్మాసింగ్, నాయకులు రాజేందర్ సింగ్ మాట్లాడుతూ మహారాణ ప్రతాప్ 1540 మే 9 రాజస్థాన్లోని చిత్తూరులో ఉదయ్ సింగ్ జయంతి బాయి లకు జన్మించారన్నారు.
మహారాణా ప్రతాప్ మేవాడు రాజుగా పాలించాడని, భారత దేశ చరిత్రలో ఆయన సాహసం, శౌర్యం, త్యాగం, బలిదానం భావి స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచాయన్నారు. ఆయన మాతృభూమి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సైనికులను తయారు చేశారన్నారు. యుద్ధంలో తినడానికి తిండి దొరకకపోవడంతో గడ్డి రొట్టెలు తీసుకొని వాటిని తిని యుద్ధంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన 1597 జనవరి 9న చావండి వేటలో ప్రమాదంలో గాయాలై మృతి చెందారని, ఆయన సాహసం, స్ఫూర్తి నేటి యువతకు సమాజానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ సింగ్, గోపి సింగ్, సంజయ్ సింగ్, విజయ్ సింగ్, అక్షయ్ సింగ్, గీతా సింగ్, రన్వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.