ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 23 : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు జాప్యానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశంలో జాతీయ నాయకుడు మంథని సామ్యూల్ మాదిగ మాట్లాడుతూ.. రేవంత్‌పై మండిపడ్డారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే ఆధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో ఇప్పటికీ ఇంకా అమలు కాకపోవడానికి ముఖ్యమంత్రే కారణమన్నారు. వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా అమలు పరచకుండా.. 11062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి మాదిగ జాతికి తీరని ద్రోహం చేశాడన్నారు. వర్గీకరణ అమలయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు వెంకట్రాములు మాదిగ, కంతి పద్మారావు మాదిగ, సట్టిగారి లక్ష్మి మాదిగ, బాలరాజు మాదిగ, లావణ్య మాదిగ తదితరులున్నారు.