పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే తల్లిదండ్రులకు ఫీజులు పెనుభారంగా మారుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇవే కాకుండా మధ్యమధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్స్‌కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖలీల్‌వాడి, జూన్ 5:జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిలువు దోపిడీ మొదలైంది. విద్యాసంస్థల యాజమాన్యాల వ్యాపారధోణి మితిమీరిపోతున్నది. అడ్మిషన్ల పేరిట ముందే ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత నిబంధనలు తుంగలో తొక్కి విద్యా సంవత్సరం మొదలుకాకముందే నోట్‌బుక్కులు, పుస్తకాలను యథేచ్ఛగా విద్యార్థులకు అంటగడుతున్నారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లింద్రులకు ఫోన్ చేసి పాఠ్యపుస్తకాలు, బెల్ట్‌లు, యూనిఫామ్‌లు తమ వద్దే తీసుకోవాలని, బయటి పుస్తకాలను అనుమతించమని చెబుతున్నారు. విద్యార్థుల ఫీజులతోపాటు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుపడాలని తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఈ నెల 12న ప్రారంభమవుతున్న పాఠశాలల యాజమాన్యాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. పరిమిత సీట్లు ఉన్నాయని కార్పొరేట్ సంస్థల పేరిట అడ్మిషన్లు చేసుకున్నారు. అడ్మిషన్ ఫీజు, టెస్టు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో ఒక్కో రేట్ ఫిక్స్ చేస్తున్నారు. నర్సరీకి రూ.10 నుంచి రూ.50వేల వరకు తీసుకుంటున్నారంటే నమ్మశక్యం కాదు. ఇంటర్నేషనల్ పేరిట లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీటికి తోడు అదనంగా ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, యూని ఫాం, టై, బెల్టు తదితర వాటి పేరిట తల్లిదండ్రుల జేబులకు చిల్లుపెడుతున్నారు.
ఐఐటీ, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్ పాఠశాలల పేరిట మెరుగైన వసతులు ఉన్నాయని కలర్ కరపత్రాలని తయారుచేసి తల్లిదండ్రులను మాయచేస్తున్నారు. ఎలాంటి అనుమతులూ పొందకుండానే పాఠశాలలు నిర్వహిస్తూ మౌలిక వసతులు లేకున్నా వేలల్లో డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నారు. సేవా రంగమైన విద్యారంగాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. క్రీడా మైదానాలు, ఫైర్ సెఫ్టీ, బస్సులకు ఫిట్నెస్ వంటివి లేకుండానే విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా వెలుస్తున్న పాఠశాలలు బోలెడున్నాయి. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో (సీబీఎస్ఈ సిలబస్ పేరిట) ఎలాంటి అనుమతి లేకుండానే ఓ పాఠశాల వెలిసింది. అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. అయినా అధికారులు ఆ పాఠశాల వైపు కన్నెత్తి చూడడం లేదు. గూపన్పల్లి ప్రాంతంలో ఓ పాఠశాల అనుమతి లేకుండానే కొనసాగుతున్నది. ఓ వెంచర్లో కార్పొరేట్ పాఠశాల, మాధవనగర్ వద్ద ఇంటర్నేషనల్ పాఠశాలలు అనుమతి లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. సుభాష్‌నగర్‌లో ఓ ప్లేస్కూల్ కూడా ఎలాంటి అనుమతీ లేకుండానే కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల దాటవేత ధోరణి విద్యాసంస్థల యాజమాన్యాలకు వరంలా మారింది. పాఠశాల యాజమాన్యాల నుంచి అందుతున్న మాముళ్ల కారణాంగానే అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో అనుమతిలేని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్మిషన్లు తీసుకుంటున్న ట్లు ఫిర్యాదు చేస్తే చర్య లు తీసుకుంటాం. పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుం టాం. తోకల పేర్లతో వస్తున్న పాఠశాలలకు అనుమతి ఉందో లేదో చూసుకొని అడ్మిషన్లు తీసుకోవాలి.