ఖలీల్‌వాడి, జూలై 30: పంట రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. రెండో విడుత రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు.
అంతకు ముందు హైదరాబాద్‌లో రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని అధికారులు, రైతులతో కలిసి తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం చేపడుతున్న రుణమాఫీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఎక్కడైనా క్షేత్ర స్థాయిలో ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే తొలి విడుత మాఫీకి సంబంధించి 517 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా 72888 94557, 72888 94554 నెంబర్లకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. మలివిడుత రుణమాఫీ నిధులను రెండు రోజుల్లోపు రైతుల ఖాతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని, వారు తమ అవసరాల కోసం ఆ నిధులను వినియోగించుకునేలా చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఏడీఏ వాజిద్‌హుస్సేన్, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహాన్, పాపయ్య పాల్గొన్నారు.