మోర్తాడ్/ ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట/ బిచ్కుంద/బాన్సువాడ, ఆగస్టు16: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి లక్ష క్యూ సెక్కులకు పైగా వరద రావడం ఇది రెండోసారి మాత్రమే. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1083 అడుగుల (53.62టీఎంసీల) నీటి నిల్వ ఉన్నది.
ప్రాజెక్ట్ నుంచి 4,952 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుండగా, కాకతీయకాలువకు 4వేలు, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 541 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపం లో వెళ్తున్నది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టులోకి 800 క్యూసెక్కుల వదర వచ్చి చేరుకున్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మూడు రేడియల్ గేట్ల ద్వారా 300 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదిలారు.
మరో 50 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి మళ్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 408.30 మీటర్ల నీరు నిల్వ ఉన్నదని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1464 అడుగులు(1.82 టీఎంసీలు) కాగా పూర్తిస్థాయిలో నిండిందని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 12,867క్యూసెక్కుల వరద ప్రాజెక్టు పైభాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందన్నారు.
31,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా 1397.66 అడుగులు (9.407టీఎంసీలు) మేర నీరు చేరిం ది. జుక్కల్ మండలం కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 1851క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458మీటర్లకు 456.40మీటర్ల నీరు ఉన్నదని అధికారులు తెలిపారు.