MLA Sudarshan Reddy శక్కర్ నగర్ : బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గృహస్థలాల మంజూరిపై ఎమ్మెల్యేతో మాట్లాడి, బోధన్ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో చర్యలు చేపడతామని, న్యాయవాదులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర ముఖ్యమైందని, వృత్తి తో పాటు సామాజిక, పౌర సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికై ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసిన వారిలో బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, న్యాయశాఖ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గంగారెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బానోత్ రమేష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వీ హనుమంతరావు, న్యాయవాదులు పోశెట్టి, యూసఫ్ ఆబేద్ అహ్మద్ సోఫీ, ఇంద్రకరణ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.