దక్షిణ డిస్కం రోజుకొక వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా విడుదలైన డిప్యుటేషన్ ఉత్తర్వులు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు సీఎండీ ఎవరనే ప్రశ్నకు దారితీశాయి. పాత సీఎండీ ముషారఫ్ పేరుతో ఇచ్చిన జీవోతో అసలు సీఎండీ ఎవరా అంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఉండగా ఇంకా పాత సీఎండీ ముషారఫ్ పేరునే చాలా చోట్ల వాడడంపై దుమారం చెలరేగుతోంది. కొత్తగా మూడో డిస్కం ఏర్పాటు తర్వాత నుంచి ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గొడవ సృష్టించడానికి ఎస్పీడీసీఎల్కు చెందిన కొందరు అధికారులు ప్రయత్నిస్తుండడంతో పాలనాపరంగా చాలా అంశాల్లో లోపాలు బయటపడుతున్నాయి. వీటిని లీకులిచ్చి ఈ ఇద్దరి మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పలువురు సీనియర్లపై గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయానికి ఇద్దరు డ్రైవర్లను దక్షిణ డిస్కం నుంచి డిప్యుటేషన్‌పై పంపడానికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్పీడీసీఎల్కు సీఎండీగా పనిచేసి గత నెలలో బదిలీ అయి కొత్త డిస్కంకు సీఎండీగా వెళ్లిన ముషారఫ్ ఫరూఖి పేరుతో ఇవ్వడం దుమారం రేపుతోంది. దక్షిణ డిస్కం సీఎండీగా జితేశ్ పాటిల్ ఉన్నప్పటికీ ఇంకా ముషారఫ్నే సీఎండీగా భావిస్తున్నారా.. ఆయన కనుసన్నల్లోనే డిస్కం పనిచేస్తోందా అంటూ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. ముషారఫ్ కొత్త డిస్కంకు సీఎండీగా బదిలీ అయిన తర్వాత కొన్ని బదిలీల ఉత్తర్వులు వెలువడడం అప్పట్లో సంచలనం కాగా తాజా ఉత్తర్వులతో అసలు దక్షిణ డిస్కం సీఎండీ ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది.
సిటీబ్యూరో, మార్చ్ 17 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల క్రితం ఆర్‌అండ్‌ఎం పనుల కోసం ఇద్దరు డ్రైవర్లను డిప్యుటేషన్ ప్రాతిపదికన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయానికి కేటాయిస్తూ ఎస్పీవోవోఎంఎస్నెం.453, తేదీ 16.03.2026న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సాధారణంగా ఈ ఉత్తర్వుల్లో ఏ మాత్రం తేడా లేకున్నా అసలు ఉత్తర్వులు జారీ చేయాల్సిన అధికారులే మారిపోవడంపై టీజీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాత సీఎండీ ముషారఫ్ పేరుతో డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేయడమనేది ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.
ఏప్రిల్ 2026 నుంచి మార్చి 2027 వరకు సంవత్సరం పాటు ఇద్దరు డ్రైవర్లను డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసుకు డిప్యుటేషన్‌పై పంపించే ఉత్తర్వులు గత నెల 24న సీఎండీ ముషారఫ్ ఉండగానే నోట్‌ఫైల్ పెట్టారు. అయితే ఆ తర్వాత ఆయన బదిలీ కావడంతో ఈ ఉత్తర్వులకు సంబంధించి మొత్తం వ్యవహారం కొత్త సీఎండీ జితేశ్ పాటిల్ దృష్టిలో పెట్టి ఆయన పేరుతో ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ప్రాజెక్ట్స్ విభాగంలోని కొందరు అధికారులు చేసిన తప్పిదమా లేక కావాలని ఇద్దరు అధికారుల మధ్య వివాదం సృష్టించే కారణమా.. ఏదేమైనా సీఎండీల మధ్య కొంత గ్యాప్ సృష్టించే దిశగా ఈ ఉత్తర్వులు కారణమయ్యాయనే చెప్పాలి.
ఏదైనా ప్రతిపాదనలు వచ్చినప్పుడు సంబంధిత ఏఈ ద్వారా ఫైల్ ప్రారంభమై ఏడీఈ, డీఈ, ఎస్ఈ, సీఈ, సంబంధిత డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్, సీఎండీవరకు నోట్ ఫైల్ పంపుతారు. సీఎండీ ఆమోదం అనంతరం అదే ఫైల్ తిరిగి ఏఈ వరకు చేరుతుంది. ఏఈ ఆమోదం పొంది నోట్ ఫైల్ ఆధారంగా తుది ఉత్తర్వుల కాపీ తయారు చేసి సీఈ వరకు పంపి ఉత్తర్వులు జారీ చేస్తారు. పై ఉత్తర్వులో గత నెల 24వ తేదీన ఫైనాన్స్ డైరెక్టర్ వద్ద బడ్జెట్ ఆమోదం పొందిన ఫైల్ సీఎండీకి పంపించి ఆమోదం పొందారు. ఆ ఫైల్ తిరిగి సీ ద్వారా ఆర్డర్ జారీ చేశారు.
ఈ ఆర్డర్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది కావడంతో సంబంధిత ఇంజినీర్లు కొంత సమయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసి ఉండవచ్చని డిస్కం అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత సీఎండీ జితేశ్ పాటిల్ బదులు ముషారఫ్ పేరుతో ఉత్తర్వులు ఎలా జారీ చేశారనేది ప్రస్తుతం డిస్కంలో చర్చకు దారి తీసిన అంశం. పాత తేదీలతో వ్యక్తిగత ఉత్తర్వులు ఇచ్చి దానిపై లబ్ధి పొందిన వ్యవహారాలు కూడా ఉన్నాయంటూ డిస్కంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కేవలం ఒకరిద్దరు డైరెక్టర్లు, కొందరు అధికారులు ఉన్నారని వారిప్రమేయంపై విచారణ జరిపించాలని పలువురు సీనియర్ అధికారులు తేల్చిచెప్పారు.
మొదటి నుంచి వివాదాలే..
మింట్కాంపౌండ్లోనిటీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో రెండు డిస్కంలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాల్లో సీఎండీలకు కేటాయించిన చాంబర్ల దగ్గర మొదలైన గొడవ ఇప్పటికీ తేలడం లేదు. ముఖ్యంగా దక్షిణ డిస్కం సీఎండీగా గతంలో కొనసాగి ప్రస్తుతం రైతుడిస్కంకు సీఎండీగా ఉన్న ముషారఫ్ ఫరూఖి పాత చాంబర్‌నే వినియోగిస్తుండగా కొత్తగా ఎస్పీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జితేశ్ వీ పాటిల్‌కు నామమాత్రంగా చాంబర్ కేటాయించడం, ఇందులో సివిల్ వర్క్స్ చూసే డైరెక్టర్ చూపిన అత్యుత్సాహం కారణంగా ఈ ఇద్దరు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల మధ్య వివాదానికి దారితీసింది.
కొత్త డిస్కం ఏర్పాటు కంటే ముందే ఎస్పీడీసీఎల్ సీఎండీకి ప్రత్యేక చాంబర్ రూపొందించాలంటూ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్స్‌లో సివిల్స్ విభాగానికి సంబంధించిన అధికారుల్లో కొందరు ఈ ఇద్దరు అధికారుల మధ్య గొడవ సృష్టించడానికి చాంబర్ల ఏర్పాటులో ఆలస్యం చేశారన్న చర్చ జరిగింది. ఇదిలా ఉంటే కొన్ని సర్కిళ్లలో బదిలీలు జరగగా వాటిని హెచ్ఆర్ విభాగానికి చెందిన కొందరు అధికారులు పాత సీఎండీ ముషారఫ్ వద్ద కూర్చుని అతను బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసి మార్చి 1న అధికారులకు ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. తాజాగా జారీ చేసిన డిప్యుటేషన్ ఉత్తర్వులు కూడా హెచ్ఆర్, ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన విభాగాలతోనే సంబంధముండడంతో అసలు ఈ వివాదాలకు కారణమెవరా అన్న కోణంలో ఇద్దరు సీఎండీల మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ఒకరిద్దరు డైరెక్టర్లు ఈ ఉత్తర్వుల జారీతో పాటు లీకులివ్వడంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని వీరిపై చర్యలకు ఎనర్జీ సెక్రటరీతో పాటు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సీఎండీలు సిద్ధమైనట్లు తెలిసింది.