జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ)/పరకాల : ‘జిల్లాలు తీసెయ్య అని రేవంత్ చెబుతున్నాడు.. తీసేస్తే ఊరుకోవడానికి ఇక్కడి ప్రజలు అమాయకులా.. వీపు చింతపండు అయితది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సోమవారం ఆయన భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరు దండుపాళ్యం బ్యాచ్‌గా పేరొందుతుందని, దోచుకోవడం, దాచుకోవడమే వారి ఏజెండాగా మారిందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు అంటూ దొంగ హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశాడని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేశాడని, ఆయన పాలనలో దేశానికి తలమానికంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పరకాల నియోజకవర్గంలో నెలకొల్పాడని గుర్తు చేశారు.

రేవంత్‌రెడ్డి సీఎం అయిన రెండున్నరేండ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగలేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ పడ్డ హామీలపై గల్లా పట్టి నీలదీయన్నారు. అధికారం ఎవరి సొత్తు కాదు.. మళ్లీ వస్తం.. ఎవ రినీ వదలం.. మా కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కాంగ్రెసోళ్లు ఇంటింటికి వస్తరు.. కాళ్లు మొక్కుతరు.. మనం నమ్మితే ఐదేళ్లు మనం వాళ్ల కాళ్లు మొక్కాల్సి వస్తది.. జర జాగ్రత్తగా ఉండండి అని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వారికి కర్రు కాల్చి వాత పెట్టకపోతే మనకు యూరియా రాదు.. రైతు బంధు రాదు.. బోనస్ రాదన్నారు. భస్మాసుర హస్తమైన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో 12 ఏళ్లు పాలిస్తున్న బీజీపీ పూజకు పని కిరాని పువ్వు అని, ఈ రెండు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.

ఒకసారి తప్పుచేసి ఐదేళ్లు మోసపోయారని, మరోమారు తప్పు జరిగితే మనం మోసపోయినట్టు అవుతుందని గుర్తు చేశారు. ఈనెల 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, మాలోత్ కవిత, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వాసుదేవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి నల్లబంగారం.. సీఎం రేవంత్ అత్తగారికి కొంగు బంగారమయ్యిందని కేటీఆర్ అన్నారు. తన బామ్మర్ది సృజన్‌రెడ్డికి రూ. 6 వేల కోట్లు ధారాదత్తం చేశాడని, తన ఫుట్‌బాల్ పోటీల కోసం సంస్థ నిధులు రూ. 10 కోట్లు వెచ్చించాడని, మెడికల్ బోర్డును 11 నెలలుగా పక్కన పెట్టాడని, ఈ చేతకాని సీఎం సింగరేణిని ముంచుతాడని విమర్శించారు. సింగరేణి కుంభకోణం బయటపడగానే ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. జయశంకర్ జిల్లా పేరు పెట్టిందెవరు?, జిల్లా చేసిందెవరు?, మెడికల్ కాలేజీ తెచ్చింది ఎవరు?, కలెక్టర్, ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? 1000 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు?, సింగరేణిలో కారుణ్య నియామకాలు తెచ్చింది ఎవరు? మరి ఈ పొట్టోడు పీకింది ఏంటి అని ఎద్దేవా చేశారు.

మానుకోటకు వచ్చి వెళ్లిన ప్రతిసారి రీచార్జి అయినట్టు ఉంటుందని మాజీ మంత్రి తారక రామారావు అన్నారు. మహాకవి దాశరథి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం నిజామాబాద్‌లో పుట్టాడనడం సిగ్గు చేటన్నారు. బయ్యారంలో ఉకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదన్నారు.

