పెద్ద కొడప్గల్ (పిట్లం), ఆగస్టు 19: అధిక వర్షాలు కురిసినప్పుడు వరద ఉధృతితో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించిన వంతెనతో కుర్తి గ్రామస్తుల కష్టాలు తొలగాయని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు వారు పిట్లం మండల కేంద్రంలోని కుర్తి వంతెనపై మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హయాంలో కుర్తి గ్రామాన్ని దత్తగా తీసుకున్నారని తెలిపారు. కేటీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమానికి వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు చేయగా పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినప్పుడు వరద ఉధృతి ఉండగా వంతెన నిర్మాణంతో రాకపోకలు సాగించడానికి గ్రామస్తులకు ఇబ్బందులు దూరమైనట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చొరవతోనే వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, నాయకులు లచ్చిరెడ్డి, నర్సాగౌడ్, వెంకట్రెడ్డి, మైపాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, శాదల్, గుంట సాయిలు తదితరులు పాల్గొన్నారు.