న్యూఢిల్లీ: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టిపారేసింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న 23 మందిపై నమోదు అయిన అభియోగాల నుంచి విముక్తి కల్పించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు కవితను కూడా ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. కోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తన ఎక్స్ అకౌంట్లో సత్యమేవ జయతే అని పోస్టు చేశారు.
Satyameva Jayate ✊🏼
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 27, 2026
స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఇవాళ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసును మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎటువంటి కుట్ర జరగలేదని, నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు చెప్పింది. ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులపై సీబీఐ ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయినట్లు కోర్టు పేర్కొన్నది. కేవలం అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును నమోదు చేసిన సీబీఐ వ్యవహార శైలిని కోర్టు తప్పుపట్టింది.
ఒకవేళ ఇలాంటి వ్యవహారాన్ని అనుమతిస్తే, అప్పుడు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్లు అవుతుందని, నిందితుడికి క్షమాభిక్ష పెట్టి, ఆ నిందిత వ్యక్తిని అప్రూవర్‌గా మార్చి, ఆ వ్యక్తి నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తును కొనసాగించడాన్ని, దాని ఆధారంగా వ్యక్తులను తప్పుపట్టడాన్ని న్యాయమూర్తి ఖండించారు. సీబీఐ అధికారులపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. 2022, జూలై 20వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ తన కేసును నమోదు చేసింది.