మెట్ట రైతుపై సర్కారు కత్తిగట్టింది. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్నా.. కొద్దిరోజులుగా మేడిగడ్డ వద్ద నీరు వృథాగా పోతున్నా చోద్యం చూస్తూ తాజాగా, మరో దెబ్బ కొట్టింది. ఇటీవల రెండ్రోజులపాటు వర్షాలు పడగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులకు కొంత వరద వచ్చింది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగమైన ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా రిజర్వాయర్‌లోకి తరలించగా, నీటి నిల్వ సామర్థ్యం కొద్దిగా పెరిగింది. దీంతో రైతాంగం ఎంతో సంబురపడింది. అయితే, మూడు రోజుల కింద మంత్రుల జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టుల జలాలు సేద్యానికి ఇవ్వవద్దని అధికారులను ఇన్చార్జి మంత్రి తుమ్మల ఆదేశించడంతో కంగుతిన్నది. ఇటీవల ఒకటి రెండు వానలతో ఊరటనిచ్చినా తీవ్రమైన లోటే ఉన్నదని, నీరు ఇవ్వకపోతే ఎలా అని ఆగ్రహిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్‌నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నీరు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సీజన్లో సాగునీరు అందుతుందో లేదోననే ఆందోళన చెందారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో బోరుబావులపైనే ఆధారపడ్డ కర్షకులు దిగులు చెందారు. జిల్లాలో ఈ సీజన్లో 2,45,660 ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1.80 లక్షల ఎకరాల్లో వేస్తారని అంచనా ఉండగా, వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు కేవల 98 వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. పత్తి సాగు పర్వాలేదనిపించేలా 49 వేల ఎకరాలకు 46 వేల ఎకరాల్లో వేశారు. వీటితోపాటు మక్కజొన్న, కూరగాయలు, కందులతో పాటు ఆయిల్‌ఫాం సాగు పంటలు సాగు చేస్తున్నారు. అయితే చాలా చోట్ల సాగుకు నీళ్లు లేక పంటలు, నారుమడులు ఎండిపోవడంతో రైతులు కలతచెందారు. బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్, కొత్తపేట, ఇల్లతంకుంట మండలం కందికట్కూర్, పొత్తూర్ గ్రామాలకు చెందిన రైతులు మధ్యమానేరు నుంచి నీటి విడుదల చేయాలని ఇటీవల రోడ్డెక్కి ధర్నా కూడా చేశారు.
ఈ క్రమంలో ఇటీవల నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో రైతులకు కొంత ఊరట లభించింది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర (మధ్య మానేరు), ఎగువ మానేరు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. అయితే, ఇన్నాళ్లూ కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయక చోద్యం చూసిన సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగమైన పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌కు భారీగా వరద రావడంతో ఈ నెల 29న నీటి ఎత్తిపోతలు ప్రారంభించింది. నందిమేడారంలోని నంది పంప్‌హౌస్, కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ల్లో బహుబలి మోటర్లు ఆన్ చేసి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మధ్యమానేరులోకి నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండగా, నీటి నిల్వ సామర్థ్యం రోజురోజుకూ పెరుగుతున్నది. ఎత్తిపోతలతో పాటు మూలవాగు జలాలతో మిడ్ మానేరులో నీటి నిల్వ 7 టీఎంసీల నుంచి 11.968 టీఎంసీలకు చేరింది. జిల్లాలో మధ్యమానేరు జలాశయం ఎడమ, కుడి కాలువల మీద 70 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా, ప్రాజెక్టులోని జలాలతో సాగు చేసుకోవచ్చని రైతులు భావించారు.
ఆగమవుతున్న సేద్యాన్ని చూసి రైతు అరిగోస పడుతుండగా, ప్రభుత్వం పగబట్టినట్టే వ్యవహరిస్తున్నది. మూడు రోజుల కింద (గ త జూలై 30న) జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పర్యటించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌లో నీళ్లు తాగునీటికే వినియోగించాలని, వ్యవసాయానికి విడుదల చేయవద్దంటూ జిల్లా కు ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రైతులు షాకయ్యారు. ప్రస్తుతం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి కదా..? ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతున్నది కదా..? సాగుకు నీళ్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని ఎగువ మానేరుకు ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు వస్తుండగా, నీటి నిల్వ ఒక టీఎంసీకి చేరింది. అలాగే, నిమ్మపల్లి ప్రాజెక్ట్ నిండి మత్తడి దూకితే మానేరు, మూలవాగుల నుంచి జలాశయాలకు వరదనీరు చేరే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ల నుంచి వ్యవసాయానికి నీటి విడుదల చేయవద్దంటూ మంత్రుల ఆదేశాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం మన రాష్ట్రంపై ఎక్కువగా ఉంది. మున్ముందు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కురిసిన వర్షాలు రైతుకు కొంత మేలు చేస్తాయి. కానీ పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు ఉపయోగపడవు. వచ్చే ఏడాది జూలై వరకు రిజర్వాయర్లలోని నీటిని కేవలం తాగునీటికే వినియోగించాలి. సాగునీటిని విడుదల చేయవద్దు. రైతులు వరి సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలి.