కొండాపూర్ : ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers Day ) సందర్భంగా శనివారం గచ్చిబౌలిలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో సైబరాబాద్ సీపీ ( Cyberabad CP ) డాక్టర్ ఎం రమేష్ ( Ramesh ) ఉపాధ్యాయులను సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన హెచ్ఎం రెహానా బేగం, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్‌లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో సీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఓటీపీ, బ్యాంకు వివరాలను అపరిచితులకు వెల్లడించవద్దని, సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, మాదాపూర్ ఏసీపీ శ్రీధర్, రాయదుర్గం ఎస్‌హెచ్‌వో భూపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.