బీఆర్ఎస్ ముఖ్యనేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
నిజామాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలతోపాటు రజతోత్సవ మహాసభకు సన్నద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ముజీబుద్దీన్తోపాటు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, అయేషా షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఉద్యమ కాలంలో నిర్వహించిన చారిత్రక సభలతోపాటు ఈ నెలలో నిర్వహించనున్న భారీ సభకు ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై అధినేత చర్చించారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారని, ఈ మేరకు జన సమీకరణకు ఆయా నియోజకవర్గాల్లో నేతలంతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
నేతల సన్నద్ధత..
వరంగల్ సభకు సమయం ఆసన్నం అవుతుండడంతో ఉమ్మడి జిల్లాల వారీగా గులాబీ బాస్ కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రేణులను సమాయత్తం చేసేందుకు ముఖ్య నాయకులతో సమీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా కేసీఆర్ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా త్వరలోనే నియోజకవర్గాల్లో సమావేశాలను ముఖ్య నేతలంతా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏండ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో రజతోత్సవ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు నేతలంతా నిమగ్నమవుతున్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవడం, మహాసభకు జనాల రాకపోకలకు ప్రభుత్వం ఇక్కట్లు సృష్టించే అవకాశాలు ఉన్నందున పకడ్భందీగా ఏర్పాట్లు చేసుకునేందుకు నేతలంతా రెడీ అవుతున్నారు.
దాదాపుగా ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా దెబ్బ తీసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసింది. పాలన చేతగాక బీఆర్ఎస్ పార్టీపై నిత్యం నిందలు వేస్తూ కాలం గడుపుతున్న తీరుపై ప్రజల్లోనూ కాంగ్రెస్ పార్టీ సర్కారుపై అసహనం ఏర్పడింది. ఇలాంటి క్రియాశీలక సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నిర్ణయించడంతో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తితో వరంగల్ సభను దిగ్విజయం చేసేందుకు కార్యాచరణ రూపకల్పనలో భాగం కానున్నారు.