నిజామాబాద్, డిసెంబర్ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించింది. కృష్ణా, గోదావరి జలాల తరలింపు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మోసాలను ఎండగట్టారు.
ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా బీఆర్ఎస్ నేతలంతా పని చేయాలని కేసీఆర్ చెప్పారు. మూడు గంటల పాటు సాగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోథల పథకం విషయంలో జరుగుతున్న ద్రోహంపై చర్చ చేస్తూనే జల దోపిడీ వ్యవహారంపై కూలంకషంగా కేసీఆర్ వివరించారు. గోదావరి నది మిగులు జలాల తరలింపుపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని కేసీఆర్ తనదైన శైలిలో వివరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించినట్లుగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత కనిపించిందని అన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలుస్తుందన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. గర్వంతో, అహంకారంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదన్నారు. సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి ప్రజలను దగా చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం పని చేయాలని సూచించారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదన్నారు. ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందంటూ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ త్వరలోనే షురూ కానుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత పూర్తి వివరాలను శ్రేణులకు వివరించారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రూపంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ సూచించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ముజీబుద్దీన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు.