మంచిర్యాల, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో పోలీసుల ఆగడాలు కొనసాగుతున్నాయి. బాల్క సుమన్‌ను అరెస్టు చేసినా అధికార పార్టీకి కడుపు మంట చల్లారడంలేదు. జైలులో ఉన్న బాల్క సుమన్‌ను వేధింపులకు గురిచేస్తూనే.. ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులపై కత్తిగట్టి కేసులు నమోదు చేయిస్తున్నది. సుమన్ కేసు విచారణ అధికారి రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ జంగుతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి క్యాతన్‌పల్లిలోని బాల్క సుమన్ ఇంటికి వచ్చారు.
సుమన్ కార్యాలయ సిబ్బందితో ఇంటి తాళాలు ఓపెన్ చేయించారు. ఇల్లంతా తిరుగుతూ బాత్రూమ్లు, కప్‌బోర్డులు కూడా వదలకుండా తనిఖీచేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, సుమన్ కార్యాలయంలో పని చేసే శ్రీను ఫోన్లను లాక్కున్నారు. రాళ్లదాడి కేసులో ఏ-11గా ఉన్న దినేశ్ కేసు నమోదయ్యాక అప్స్కాండ్లో ఉన్నారు. దినేశ్‌పై నిఘా పెట్టిన పోలీసులు గద్దెరాగడికి వచ్చాడని తెలుసుకొని, బాల్క సుమన్ ఇంటికి వచ్చే దాకా ఎదురుచూశారు. అతను ఇంట్లోకి ప్రవేశించాక అరెస్టు చేశారు.
ఎలాగైనా సుమన్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకే ఇలా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై రామకృష్ణాపూర్ పోలీసులను వివరణ కోరగా.. నిందితులు బాల్క సుమన్ ఇంట్లో దాక్కున్నారని సమాచారం రావడంతో వెళ్లి రైడ్ చేశామని చెప్పారు. కేసులో ఏ-11గా ఉన్న దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సుమన్ ఇంట్లో ఉన్న సిబ్బంది ఫోన్లు స్టేషన్‌కు తీసుకువచ్చిన మాట వాస్తవమేనని, వాళ్లకు దీనితో సంబంధం లేదని తెలిశాక ఫోన్లు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.