వరంగల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సకల హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ‘ఇదీ మా మార్క్’ అనే రీతిలో రాష్ట్రంలో ఏ ఒక్క భారీ నిర్మాణానికి పునాది రాయి పడింది లేదు. ఒకవేళ వేసినా వాటిని పూర్తి చేసిన దాఖలాలు లేకపోవటంతో రేవంత్‌రెడ్డి సర్కార్‌పై వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి. ‘కట్టింది కేసీఆర్ అయితే.. రిబ్బన్ కటింగ్ రేవంత్‌రెడ్డిది’ అని విస్తృత ప్రచారం సాగుతున్నది. హనుమకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి మొదలు ఇప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రారంభించిన పలు నిర్మాణాలు నాడు కేసీఆర్ హయాంలో పూర్తయినవేనంటూ ఉదహరిస్తున్నారు. వరంగల్‌లో నాడు కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణ పనులు మొదలుపెట్టి దాదాపు 85శాతం పూర్తిచేసిన 24అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్ సమీకృత కలెక్టరేటలో మిగిలిన కొద్దిపాటి పనులను రోజుల వ్యవధిలో పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయాల్సి ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రారంభించలేదని, అందుకు కాళోజీ కళాకేత్రం ప్రారంభోత్సవమేననే చర్చ జరుగుతున్నది. నాడు కేసీఆర్ హయాంలో ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు చేసే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో కాళోజీ కళాక్షేత్రం కేసీఆర్ ప్రారంభించలేకపోయారని, ‘కష్టమొకరిది.. పేరొకరిది’ అన్నట్టు కేసీఆర్ కడితే రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచార ఉదంతాన్ని మనసులో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాటిని వాయిదా వేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేగాక అప్పుడే ప్రారంభిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్‌కు వెళ్తుందని, కేసీఆర్ పట్టించుకోకపోతే తామే శ్రద్ధ తీసుకొని పూర్తి చేశామని ప్రచారం చేసుకోవచ్చనే కాలయాపన చేశారని చెప్తున్నారు. ఈ క్రమంలో వచ్చే డిసెంబర్ 7నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తి చేసుకొనే సందర్భంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తోపాటు వరంగల్ కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు ములుగు జిల్లా ఏర్పాటుచేయటమే కాకుండా అన్ని జిల్లాలతో సమానంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన జిల్లా సమీకృత కలెక్టరేట్ నిలువెత్తు సంతకం అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా తొలుత 2016 అక్టోబర్ 11న 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అప్పుడు ములుగు ప్రాంతం జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. మంగపేట, ఏటూరునాగారం వంటి సుదూర ప్రాంతాల ప్రజలు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రానికి వెళ్లేందుకు ఎంత ప్రయాసపడ్డారో భూపాలపల్లిలోని జిల్లాకేంద్రానికి వెళ్లేందుకూ అంతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకూ జిల్లా కావాలని ములుగువాసులు కోరుకున్నారు. అదే సమయంలో 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ములుగుకు వచ్చారు. ‘బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి.. ములుగును జిల్లా చేసుకుందాం’ అని మాటిచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ఇచ్చిన మాట కోసం 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. 2023, జూన్ 7న కలెక్టరేట్ కోసం 16 ఎకరాలు, రూ.55 కోట్లు కేటాయించగా, నాటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ భూమిపూజ చేయగా, పనులను ప్రారంభించారు. 2023లో ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక మిగిలిన పనులు దాదాపు 32 నెలల్లో పూర్తి కాగా, నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఖిలా వరంగల్ కోట శిరసెత్తి చూసేలా 24 అంతస్తులతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యింది. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిద్దాలన్న కేసీఆర్ సంకల్పానికి దర్పణంగా, కాకతీయ కళాతోరణానికి ఆధునిక కీర్తి కిరీటంగా ముస్తాబైంది. వరంగల్, హనుమకొండ ఇరు పట్టణాలకు మధ్య 59 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.1,150 కోట్లతో జూన్ 2021లో కేసీఆర్ భూమిపూజ చేయగా, దాదాపు 80శాతం పనులు పూర్తిచేశారు. ఇంతలో ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో పనులు నిలిచిపోయాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మొదలు సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి, అధికారులతో సమీక్షించి ప్రారంభోత్సవ డెడ్‌లైన్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు వెళ్లి ఒత్తిడి చేయడంతో జూన్ 2న ప్రారంభిస్తామన్నారు. తాజాగా అదీ వాయిదా పడింది.
ములుగు కలెక్టరేట్ కంటే ముందే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. గత నెల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే వరంగల్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని సర్కార్ సంకేతాలిచ్చింది. దీంతోపాటు వరంగల్‌లోని హాస్పిటల్‌ను అదే రోజు ఓపెన్ చేస్తారనే ప్రచారం జరిగింది. ములుగు కలెక్టరేట్ లాన్ పనులు పూర్తికాకపోయినా సీఎం అటే మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది. వరంగల్ కాంగ్రెస్‌లో అసమ్మతి, తాజాగా పొంగులేటి, ఎమ్మెల్యే కడియంపై మంత్రి కొండా సురేఖ అధిష్ఠానానికి ఫిర్యాదుతో కలెక్టరేట్ ప్రారంభోత్సవం వాయిదా పడినట్టు తెలుస్తున్నది.
రేవంత్ సర్కార్‌కు ప్రచార ఆర్భాటమే కానీ, నిర్మాణాత్మక ప్రగతిపై ధ్యాస ఎక్కడిదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రగతికి ఇవ్వడం లేదని ఈ 32 నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి నిరూపించారనే వాదన బలంగా వినిపిస్తున్నది. నాడు కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పనులు పూర్తయినా పెద్దగా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని చెప్తున్నారు. కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పి రికార్డు స్థాయిలో ఒకేసారి 8 కాలేజీలను ప్రారంభించిన ఉదంతాలను గుర్తుచేస్తున్నారు. అదే రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వ కీర్తిగా భారీ ఎత్తున జరుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం.