ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పేరుతో ఆస్తులు సేకరించినప్రభుత్వం… నిర్వాసితులకు పరిహారం విషయంలో మొండి చెయ్యి చూపుతోంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పరిధిలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, భూములను కోల్పోతున్న బాధితులకు పరిహారంగా ఉత్త కాగితాలను చేతిలో పెట్టి చోద్యం చూస్తోంది. బాధితులందరికీ ఆమోదయోగ్యమైన మార్కెట్ ధర ప్రకారమే పరిహారం ఇస్తామంటూ బీరాలు పలుకుతున్న నేతలు.. రికార్డుల్లో నష్టపరిహార ఉత్తర్వులు జారీ చేసిన వారికీ నగదును విడుదల చేయకుండా నయవంచనకు గురి చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి నార్త్ తెలంగాణకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రహిత రహదారుల నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచిత్రమైన చేష్టలతో… సొంత ఆస్తులను కోల్పోయి నిలువ నీడ లేకుండా పోతున్నారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించే 18కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్, లోతుకుంట, బొల్లారం, శామీర్‌పేట్ పరిధిలోని ప్రైవేటు ఆస్తులు, ఇండ్లు, వాణిజ్య సముదాయాలు, నిర్మాణాలను సేకరించేందుకు భూసేకరణ చట్టం కింద నోటీసులు జారీ చేశారు. రోడ్డు వెడల్పును 100-200ఫీట్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులతో వందలాది మంది తమ ఆస్తులు, ఉపాధి మార్గాలను కోల్పోవాల్సి వచ్చింది.
పరిహారం పేరిట కాగితాలు కట్టబెట్టి…
ప్రాజెక్టుకు పరిహారం తేల్చేంత వరకు భూములు ఇచ్చేది లేదనీ భీష్మించుకుని కూర్చున్న జనాలను విడగొట్టేలా కొందరిని వ్యక్తిగత పిలుచుకుని పరిహారం పేరిట కాగితాలను అధికారులు కట్టబెట్టారు. వీటికి సముచిత పరిహారం తమ ఖాతాల్లో జమ చేస్తామంటూ నమ్మించారు. చివరకు చేతిలో పెట్టిన హామీ పత్రాలతో తమకు న్యాయం జరుగుతుందని రెండు నెలలుగా ఆశగా ఎదురుచూసిన ఫలితం లేదని వాపోతున్నారు. పరిహారం పేరిట ఉత్త కాగితాలను తమకు కట్టబెట్టి… ఆస్తులను లాగేసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. నిర్మాణాలకు విడిగా అంచనా విలువ చేసి, న్యాయమైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బాధితులకు ఇచ్చిన రూ. 50లక్షల చొప్పున పరిహార పత్రాలకు రూపాయి కూడా విడుదల చేయకుండా వేధిందిస్తున్నారు. దీంతో భూసేకరణ ప్రక్రియను గట్టెక్కించడానికి ప్రభుత్వం ఆడిన డబుల్ గేమ్‌తో ఆస్తులను ఇచ్చినవాళ్లు నిండా మునిగిపోయామని తలలు బాదుకునే పరిస్థితి. రెండు నెలలు దాటిన ఖాతాల్లో నిధులు జమ కాకపోవడంపై అధికారులను కలిసే వీల్లేకుండా దాటవేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
భూములిచ్చేందుకు భయపడుతున్న జనం..
పరిహారం విషయంలో సర్కార్ చేస్తున్న నమ్మకద్రోహంతో ఇప్పుడు జనాలు భూములిచ్చేందుకు భయపడుతున్నారు. మొదటి నుంచి భూసేకరణ విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న స్థానికులను రెండుగా విడదీసిందనే విషయాన్ని గ్రహించిన రాజీవ్ రహదారి జేఏసీ నాయకులు… పరిహారం తేల్చే వరకు భూములిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం సర్వ కోల్పోయి రోడ్డున పడుతున్న నిర్వాసితులు, ఇప్పుడు బ్యాంక్ రుణాలు తీర్చలేక, ప్రత్యామ్నాయ ఆవాసాలు వెతుక్కోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జేఏసీ ప్రెసిడెంట్ తేలుకుంట సతీశ్ కుమార్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ఆస్తులు ఇవ్వలేమని, ఇస్తే ఏ ఒక్కరికి పరిహారం దక్కదని బాధితులు చర్చించుకుంటున్నారు. కళ్లబొల్లి మాటలతో, కాగితాలపై ఇచ్చే హామీలతో తమ కడుపులు కొట్టవద్దని, తక్షణమే ప్రాజెక్టు కోసం సేకరించే పరిహారాన్ని తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం కోసం నిరసన
బొల్లారం: జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటేడ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న కంటోన్మెంట్ బీ3 నివాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. శనివారం రాజీవ్ రహదారి లక్డావాలలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. సుమారు 69 కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీ2 ప్రాంతాల యజమానులకు అందించిన మాదిరిగా బీ3 నివాసితులకు సమాన పరిహారం ఇవ్వాలని కోరారు. తమ ఆస్తులను 1921 నుంచే రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ద్వారా కొనుగోలు చేసి, మూడు నుంచి నాలుగు తరాలుగా కుటుంబాలు వాటిపై హక్కులు అనుభవిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆనంద్, విశాల్,శ్రీకాంత్, ప్రీతమ్ పాల్గొన్నారు.