కరెంట్ ఉదయం పోతుందా.. సాయంత్రం పోతుందా.. మీరు అడిగే ప్రశ్నలకు మీరే కరెక్ట్ లేరు. క్యూర్ పరిధిలో విద్యుత్ కోతలే లేవు. ఎక్కడైనా ఫీడర్ ట్రిప్ అయితే వెంటనే రిపేర్ చేసి ఇస్తున్నాం.. మీరు చెప్పినట్లుగా గంటల తరబడి కరెంట్ పోతున్నదనడం నిజం కాదు.. బుధవారం మీడియా సమావేశంలో అప్రకటిత విద్యుత్ కోతలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎండీ సమాధానమిది. చాలా కాలనీలల్లో గంటల తరబడి కరెంటు పోతున్నది. ఇది సీఎండీకి తెలియలేదా.. లేక తెలిసి కావాలని అలా దాటవేత ధోరణి ప్రదర్శించారా అనేది ప్రెస్‌మీట్‌లోనే చర్చనీయాంశమైంది.
– సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)
ఎల్‌నినో ప్రభావంతో సిటీలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నదంటూ చెప్తూనే నగరంలో ప్రత్యేకించి కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎక్కడా కరెంట్ పోవడం లేదని సంస్థ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నదని చెప్పుకొచ్చారు. సీఎండీ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో నగరంలోని హైదరాబాద్ సౌత్సర్కిల్లో హుస్సేనీఆలం, కిషన్‌బాగ్, మేడ్చల్ సర్కిల్లోని బహదూర్‌పల్లిలో, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లోని అంబర్‌పేట ఏరియా ప్రేమ్‌నగర్‌లో, రాజేంద్రనగర్ సర్కిల్లోని బండ్లగూడ, శాస్త్రిపురం ఆర్కేపురం తదితర చోట్ల పగలు, రాత్రి వేళల్లో గంటల తరబడి కరెంట్ లేదంటూ ఎస్పీడీసీఎల్కు ఫిర్యాదులు వచ్చాయి.
మరి వీటి విషయంలో సీఎండీ ఏం సమాధానం చెబుతారంటే అది ఫీడర్ ప్రాబ్లం అంటారు తప్ప కరెంట్ కోతలను మాత్రం ఒప్పుకోవడం లేదు. విద్యుత్ వినియోగం పెరుగుతున్న క్రమంలో సాంకేతికంగా సమస్యలు వస్తాయని, కానీ కరెంట్ కోతలున్నాయనే విషయాన్ని సీఎండీ స్థాయి వ్యక్తులు ధ్రువీకరించకపోతే తాము ఏం చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరెంట్ పోయిందంటే తమకు వచ్చే కాల్స్‌ను అటెండ్ చేయలేకపోతున్నామని, ఆ స్థాయిలో ఒత్తిడి ఉందని వారు చెప్పారు. నగరంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే క్షేత్రస్థాయిలో ఉన్న విద్యుత్ సిబ్బందిని మరమ్మతులు చేసే క్రమంలో తమకు అవసరమైన సామగ్రి లభించక తలలు పట్టుకుంటున్నారు.
ఎల్‌నినో ప్రభావం లేని సమయంలోనే అంటే గత సంవత్సరం నగరంలోని పలు సబ్స్టేషన్లపై అధిక ఒత్తిడి పడి కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయమేర్పడింది. దీనికి ట్రాన్స్కోనే కారణమంటూ అప్పట్లో దక్షిణ డిస్కం అధికారులు ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ట్రాన్స్‌కోకు తాము జాబితా ఇచ్చామని, లోడ్ బ్యాలెన్సింగ్ కోసం గ్రిడ్ కాపాడుకోవడానికి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని సీఎండీ జితేష్ పాటిల్ చెప్పారు. అనధికారికంగా ఎప్పుడు పడితే అప్పుడు, ప్రత్యేకించి అర్ధరాత్రి వేళల్లో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సీఎండీ మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయమార్గాలపై మాట్లాడకుండా కరెంట్ నెట్‌వర్కింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని చెబుతున్నారే తప్ప సిటీలో కరెంట్ అప్రకటిత కోతలను నివారించడానికి కావలసిన మార్గాలను చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.